13,000 శిఖరంపైకి నిఫ్టీ

25 Nov, 2020 05:07 IST|Sakshi

కొనసాగుతున్న రికార్డుల ర్యాలీ  

ఆశలు పెంచిన వ్యాక్సిన్‌ వార్తలు 

ఇంట్రాడే, ముగింపులోనూ కొత్త గరిష్టాలే  

బ్యాంకింగ్, మెటల్, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు  

ఆగని ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ప్రవాహం  

ముంబై: వ్యాక్సిన్‌పై ఆశలతో స్టాక్‌ మార్కెట్లో మంగళవారమూ రికార్డుల పరంపర కొనసాగింది. బ్యాంకింగ్, మెటల్, ఫార్మా షేర్ల ర్యాలీ అండతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను నమోదుచేశాయి. నిఫ్టీ తొలిసారి 13000 మైలురాయిని అధిగమించడంతో పాటు ఈ స్థాయిపైనే ముగిసింది. దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం, రూపాయి రికవరీ అంశాలు ఇన్వెస్టర్లకు మరింత విశ్వసాన్నిచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 446 పాయింట్లు పెరిగి 44,523 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 13,055 వద్ద స్థిరపడింది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో కొంత లాభాల స్వీకరణ చేసుకోవడం మంచిదని ఇన్వెస్టర్లు సలహానిస్తున్నారు. మార్కెట్‌ దిద్దుబాటు తర్వాత నాణ్యమైన షేర్లను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాల్సిందిగా వారు సూచిస్తున్నారు. సూచీలు రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.1.35 లక్షల కోట్లను ఆర్జించారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ రూ.174.81 లక్షల కోట్లకు చేరుకుంది.  

ఆశలు పెంచిన వ్యాక్సిన్లు ...  
కోవిడ్‌–19 కట్టడికి ఫైజర్, మోడర్నా, ఆ్రస్టాజెనెకా కంపెనీలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు ఈ ఏడాది చివరికల్లా విడుదల కావచ్చనే వార్తలతో ఇన్వెస్టర్లు ఈక్విటీ కొనుగోళ్లకు ఆసక్తిచూపారు. అలాగే తాము తయారుచేసే వ్యాక్సిన్‌ తక్కువ ధరలో అందరికి అందుబాటులో ఉంటుందని ఆ్రస్టాజెనెకా ప్రకటనతో మార్కెట్‌ సెంటిమెంట్‌ మరింత బలపడింది. ఫలితంగా ఇంట్రాడేలో జరిగిన విస్తృతస్థాయి కొనుగోళ్లతో సెన్సెక్స్‌ 524 పాయింట్లు లాభపడి 44,602 వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 13,079 వద్ద కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను నమోదుచేశాయి.   

రూ.50 వేల కోట్లకు చేరిన ఎఫ్‌ఐఐల పెట్టుబడులు....  
దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. నగదు విభాగంలో వారు నవంబర్‌ 24 నాటికి రూ.50, 501 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మాత్రం ఇన్వెస్ట్‌మెంట్లను వెనక్కి తీసుకుంటున్నాయి. ఇదే నవంబర్‌ 24న నాటికి డీఐఐలు రూ.34,272 కోట్లను షేర్లను విక్రయించడం గమనార్హం.  

మార్కెట్‌ మరిన్ని విశేషాలు.. 
► ఆర్‌బీఐ మారిటోయం విధింపుతో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ వరుసగా ఆరోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో పదిశాతం నష్టపోయి రూ.7.30 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఈ షేరు కేవలం ఆరురోజుల్లో మొత్తంగా 53 శాతం నష్టపోయింది.  
► సీఎల్‌ఎస్‌ఏ టార్గెట్‌ ధరను పెంచడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3 శాతం లాభపడింది.  
► ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 178 షేర్లు 52–వారాల      గరిష్ట స్థాయిని తాకాయి.  

రూ.2,500 కోట్లు సమీకరించిన ఎస్‌బీఐ 
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) బాండ్ల జారీ ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించింది. వ్యాపార వృద్ధి కోసం ఈ నిధులను వినియోగిస్తామని ఎస్‌బీఐ పేర్కొంది. ఒక్కొక్కటి రూ.10 లక్షల ముఖ విలువ గల ఇరవై ఐదువేల బాసిల్‌–త్రి బాండ్ల ద్వారా ఈ నిధులు సమీకరించామని వివరించింది. ఈ బాండ్లకు వార్షికంగా 7.73 శాతం వడ్డీని చెల్లిస్తామని పేర్కొంది. గత నెలలో కూడా ఎస్‌బీఐ బాసిల్‌–త్రి బాండ్ల జారీ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు