Stock Market: ఈ వారం స్టాక్‌ మార్కెట్‌.. ప్రపంచ పరిణామాలే కీలకం

20 Sep, 2021 08:06 IST|Sakshi

ముంబై: దేశీయంగా స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం సూచీలకు ప్రపంచ పరిణామాలే దిశా నిర్ధేశం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా సెంట్రల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశం మంగళవారం(సెప్టెంబర్‌ 21న) మొదలై బుధవారం ముగిస్తుంది.

ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల వైపు నుంచి చూస్తే ఎఫ్‌ఓఎంసీ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకమైనవి. అలాగే బ్యాంక్‌ జపాన్‌ ద్రవ్య విధాన నిర్ణయాలు ఈ బుధవారమే వెల్లడికానున్నాయి. దేశంలో కోవిడ్‌ మూడో దశకు సంబంధించిన వార్తలను మార్కెట్‌ వర్గాలు పరిశీలించవచ్చు. వీటితో పాటు డాలర్‌ మారకంలో రూపాయి, క్రూడాయిల్‌ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు తదితర సాదారణ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.  

గత వారంలో కేంద్ర కేబినేట్‌ తీసుకున్న నిర్ణయాల ప్రభావం స్టాక్‌ మార్కెట్‌పై ఈ వారమూ కొనసాగే అవకాశం ఉంది. బ్యాడ్‌బ్యాంక్‌ రూపకల్పనకు కేబినేట్‌ ఆమోదం తెలపడంతో బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ కొనసాగవచ్చు. ఆటో రంగానికి రూ.26,058 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) కేటాయింపుతో కొంతకాలంగా స్తబ్ధుగా ట్రేడ్‌ అవుతున్న ఆటో షేర్లు లాభాల బాట పట్టొచ్చు. అలాగే ప్రభుత్వ కంపెనీలకు చెందిన షేర్లు రాణించే వీలుంది.

‘‘స్టాక్‌ సూచీలు అధిక విలువ వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ వారాన్ని లాభాల స్వీకరణతో ప్రారంభించవచ్చు. స్థిరీకరణ కోసం జరిగే ప్రయత్నంలో భాగంగా ఒడిదుడుకులతో పరిమిత శ్రేణిలో కదలాడవచ్చు. సాంకేతికంగా నిఫ్టీకి తక్షణ నిరోధ స్థాయి 17,900 వద్ద ఉంది. ఒకవేళ లాభాల స్వీకరణ చోటుచేసుకుంటే 17,400 తక్షణ మద్దతు స్థాయికి దిగిరావచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 17,200 వద్ద మరో కీలక తక్షణ మద్దతు ఉంది’’ అని సామ్కో రీసెర్చ్‌ హెడ్‌ నిరాళీ షా తెలిపారు. పీఎల్‌ఐ పథకం, బ్యాడ్‌బ్యాంక్, టెలికాం రంగానికి ప్రోత్సాహకాల కేటాయింపుతో గతవారంలో సెన్సెక్స్‌ 710 పాయింట్లు, నిఫ్టీ 216 పాయింట్లు లాభపడ్డాయి.  

21న పరాస్‌ ఐపీఓ  
పరాస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఐపీఓ మంగళవారం(సెప్టెంబర్‌ 21) మొదలై గురువారం ముగియనుంది. ఐపీఓకు ధరల శ్రేణిని రూ.165 – 175 గా నిర్ణయించారు. అప్పర్‌ బ్యాండ్‌ ధర ప్రకారం పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సంస్థ రూ.170.70 కోట్లు సమీకరించనుంది. 

గురువారం సన్సార్‌ ఇంజనీరింగ్‌ లిస్టింగ్‌...  
బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆటో ఉపకరణల తయారీ సంస్థ సన్సార్‌ ఇంజనీరింగ్‌ షేర్లు గురువారం ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్‌ కానున్నాయి. గతవారంలో రూ.1283 కోట్ల నిధుల సమీకరణకు వచ్చిన ఈ ఐపీఓ మొత్తం 11.47 రెట్ల సబ్‌స్క్రైబ్షన్‌ను సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.21 కోట్ల షేర్లను ఆఫర్‌ చేసింది. 

నికర కొనుగోలుదారులుగా ఎఫ్‌ఐఐలు 
దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది.  సెప్టెంబర్‌ 1–17 తేదిల్లో ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.16,305 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.5,018 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్‌ మార్కెట్‌లో రూ.16,305 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దేశీయ ఈక్విటీలపై ఎఫ్‌ఐఐల బుల్లిష్‌ ట్రెండ్‌ కొనసాగితే  రికార్డుల ర్యాలీ కొనసాగవచ్చు. 

ఎన్‌ఆర్‌ఎల్‌ రికార్డ్‌ 
ప్రభుత్వ రంగ సంస్థ నుమాలిగఢ్‌ రిఫైనరీ లిమిటెడ్‌(ఎన్‌ఆర్‌ఎల్‌)  చరిత్రలోనే అత్యధికంగా 375 శాతం డివిడెండును ప్రకటించింది. అంటే రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరుకీ రూ. 37.5 చొప్పున మధ్యంతర డివిడెండుగా ఇప్పటికే చెల్లించినట్లు కంపెనీ చైర్మన్‌ ఎస్‌సీ మిశ్రా తెలియజేశారు. 2020–21లో నికర లాభాల్లో సైతం 120 శాతం పురోగతి సాధించింది. ఈ విలువ రూ. 3,036 కోట్లు. ఆదాయం 32 శాతం వద్ధితో రూ. 18,544 కోట్లకు చేరింది. çకంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ప్రభుత్వానికి రికార్డు డివిడెండ్‌ అందించినట్లు ఆయన వెల్లడించారు. 

చదవండి: స్టాక్‌ మార్కెట్‌, ఇకపైనా టెక్‌ కంపెనీల ఐపీవోల జోరు

మరిన్ని వార్తలు