మార్కెట్‌ను మెప్పించని ప్యాకేజీ

13 Nov, 2020 06:11 IST|Sakshi

ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ స్టాక్‌ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. అలాగే డాలర్‌ మారకంలో రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతలు వంటి ప్రతికూల పరిస్థితులు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఐటీ, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకున్నారు. సెన్సెక్స్‌ 236 పాయింట్లు నష్టపోయి 43,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లను కోల్పోయి 12,691 వద్ద నిలిచింది. సూచీలు నష్టాల ముగింపుతో ఎనిమిది రోజుల వరుస, మూడురోజుల రికార్డు ర్యాలీలకు ముగింపు పడినట్లైంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ తయారీ పరీక్షలు విజయవంతమైనా.., భారత్‌లో వ్యాక్సిన్‌ నిలువ, సరఫరా సమస్యలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి.

మార్కెట్‌ ఎనిమిదిరోజుల సుదీర్ఘ ర్యాలీతో ప్రధాన షేర్ల వ్యాల్యుయేషన్లు భారీగా పెరగడం సూచీలపై ఒత్తిడిని పెంచాయి. అయితే కేంద్రం ప్రకటించిన రూ.2.65 లక్షల కోట్ల ప్యాకేజీ ద్వారా ప్రయోజనాలను పొందే ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, మీడియా, ఫార్మా, ఆటో, ఐటీ రంగాలకు చెందిన షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 43,544 పాయింట్ల గరిష్టాన్ని.., 43,128 కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 12,741– 12,625 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. డాలర్‌ మారకంలో రూపాయి 28 పైసలు క్షీణించి 74.64 వద్ద స్థిరపడింది.  ఉద్దీపన ప్యాకేజీలో రియల్టీ రంగానికి ఊతమిచ్చే అంశాలు ఉండడంతో ఈ షేర్లు రాణించాయి. డెవలపర్లు, గృహ కొనుగోలుదారుల ఆదాయపన్నులో ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఐబీరియల్‌ ఎస్టేట్, ఒబెరాయ్‌ రియల్టీ గోద్రేజ్‌ ప్రాపర్టీ షేర్లు 13 శాతం నుంచి 3 శాతం లాభపడ్డాయి.

>
మరిన్ని వార్తలు