మార్కెట్‌కు వ్యాక్సిన్‌ జోష్‌ 

14 Apr, 2021 04:16 IST|Sakshi

కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు 

కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌  

సెన్సెక్స్‌ లాభం 661 పాయింట్లు 

14,500పైకి నిఫ్టీ 

రాణించిన ఆటో, బ్యాంకింగ్‌ షేర్లు 

ఫార్మా, ఐటీ షేర్లలో అమ్మకాలు 

ముంబై: కరోనా వ్యాక్సిన్‌ కొరతను తీర్చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభంతో ముగిసింది. ఆరువారాల్లో అతిపెద్ద పతనం తర్వాత సూచీలకు కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించింది. మార్కెట్‌కు నేడు సెలవు కావడంతో పాటు రేపు (గురువారం) వారాంతాపు డెరివేటివ్‌ ముగింపు నేపథ్యంలో కొంత షార్ట్‌ కవరింగ్‌ జరిగింది. ఐటీ, ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ 661 పాయింట్ల లాభంతో 48,544 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 194 పాయింట్లు పెరిగి 14,505 పాయింట్ల వద్ద నిలిచింది. దీంతో సూచీలు సోమవారం కోల్పోయిన మొత్తం నష్టాల్లో 60 శాతం రికవరీ అయినట్లైంది. ఆటో, ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్‌ రంగ షేర్లు సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి.

ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 744 పాయింట్లు ర్యాలీ చేసి 48,627 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు పెరిగి 14,529 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.731 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.244 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో బలహీన సంకేతాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘‘ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో మార్కెట్‌ పుల్‌బ్యాక్‌ ర్యాలీని ఆశించిన స్థాయిలో చేయలేకపోయింది. ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి వెనకడుగు వేయడం, మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడం తదితర అంశాలు సూచీల దూకుడుకు ప్రతిబంధకాలుగా మారాయి. లాక్‌డౌన్‌ విధింపులు ఆర్థిక వ్యవస్థను ఎంత ప్రభావితం చేయగలదో అనే అంశమే రానున్న రోజుల్లో మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనుంది.’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. 

మార్కెట్లో మరిన్ని విశేషాలు...
► మార్చి త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ షేరు 4 శాతం నష్టపోయి రూ. 3,105 వద్ద స్థిరపడింది. 
► అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ మార్చి వాహన విక్రయాలు అంచనాలకు మించిన నమోదు కావడంతో టాటామోటర్స్‌ కంపెనీ షేరు 5.5% లాభంతో రూ.303 వద్ద స్థిరపడింది.  
► వాటా ఉపసంహరణ వార్తలు తెరపైకి రావడంతో ఐడీబీఐ బ్యాంకు షేరు పదిశాతం ర్యాలీ చేసి రూ.37 వద్ద ముగిసింది.

నేడు మార్కెట్‌కు సెలవు... 
బాబా అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నేడు (బుధవారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. ఎక్స్చేంజీలతో పాటు ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు. తిరిగి గురువారం అన్ని మార్కెట్లు యథావిధిగా ప్రారంభమవుతాయి. మహారాష్ట్ర నూతన సంవత్సర ఆరంభ దినం ‘గుడి పడ్వా’ పండుగ కారణంగా మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్‌ పనిచేయలేదు.  

మరిన్ని వార్తలు