ఇన్వెస్టర్లకి అలర్ట్‌: ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ ఎలా ఉంటుందో.. ఓ లుక్కేద్దాం!

25 Jul, 2022 10:31 IST|Sakshi

ఫెడ్‌ పాలసీ నిర్ణయాలు,క్యూ1 ఆర్థిక ఫలితాలు కీలకం

ఎఫ్‌అండ్‌ఓ ముగింపుపై దృష్టి

రూపాయి, క్రూడాయిల్‌ ధరలపై కన్నేయచ్చు 

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనాలు

ముంబై: స్టాక్‌ మార్కెట్లో ఈ వారమూ ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం నిర్ణయాల వెల్లడి, ఎఫ్‌అండ్‌ఓ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ ముగింపుతో పాటు కీలక కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రకటన అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో పాటు సాధారణ డాలర్‌ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్‌ ధరల కదలికల అంశాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. 

‘‘స్టాక్‌ సూచీలు ఈ వారం తీవ్ర ఊగసలాటకు గురికావొచ్చు. బుధ, గురువారాల్లో వెలువడనున్న ముఖ్యంగా యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌  ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు, రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల దిశానిర్దేశాన్ని శాసించవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే 16,800–850 శ్రేణిలో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే నిఫ్టీకి 16,250–16,500 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ రీటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమా తెలిపారు.  
►  క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్‌ సూచీలు గతవారంలో రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. ఐటీ, బ్యాంకింగ్, వినిమయ, మెటల్‌ షేర్లకు రాణించడంతో సెన్సెక్స్‌ 2311 పాయింట్లు, నిఫ్టీ 670 పాయింట్లు లాభపడ్డాయి. గతేడాది(2021) ఫిబ్రవరి తర్వాత సూచీలు ఒక వారంలో ఈ స్థాయిలో లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. 

కార్పొరేట్‌ ఫలితాల ప్రభావం  
స్టాక్‌ మార్కెట్‌ ముందుగా నేడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఇన్ఫోసిస్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. కంపెనీల షేర్లకు నిఫ్టీ సూచీలో 30 శాతానికిపైగా వెయిటేజీ ఉంది. ఇక వారంలో నిఫ్టీ సూచీలో 18 కంపెనీలతో సహా సుమారు 400కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్, టాటా స్టీల్, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పేయింట్స్, బజాజ్‌ ఆటో, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, బజాజ్‌ ఫిన్‌ సర్వ్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, నెస్లే ఇండియా, శ్రీ సిమెంట్, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీఐసీ, సన్‌ ఫార్మా కంపెనీలు క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. 

ఫెడ్‌ పాలసీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి 
అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశం మంగళవారం(జూలై 26న) ప్రారంభం కానుంది. మరుసటి రోజు (బుధవారం) చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ద్రవ్య కమిటి నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో ఫెడ్‌ కమిటీ గత సమీక్షలో చెప్పినట్లు 50–75 బేసిస్‌ పాయింట్ల వడ్డీరేట్ల పెంపునకే కట్టడి ఉండొచ్చు. అయితే ద్రవ్యోల్బణ కట్టడికి అధికప్రాధాన్యతనిస్తూ ఒకశాతం పెంపునకు మొగ్గుచూపితే అది మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపరిచినట్లే అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్‌ చైర్మన్‌ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. 

ఎఫ్‌ఐఐల యూటర్న్‌ 
కొంతకాలంగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు అనూహ్యంగా యూటర్న్‌ తీసుకున్నారు.ఈ జూలైలో ఇప్పటి వరకు(1–22 తేదీల్లో) రూ.1,100 కోట్ల విలువైన షేర్లను కొన్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ‘యూఎస్‌ రిటైల్‌ అమ్మకాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు 75 బేసిస్‌ పాయింట్లకు మించి ఉండకపోవచ్చనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ లాంటి వర్థమాన దేశాల మార్కెట్లో తిరిగి కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగిరావడం, దేశీయ జూన్‌ క్వార్టర్‌ కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడం కూడా కలిసొచ్చింది’’ అని మార్నింగ్‌స్టార్‌ ఇండియా అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. గత నెల జూన్‌లో రూ. 50,203 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 2.25 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లారు.

చదవండి: ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మిట్టల్‌ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే


         

మరిన్ని వార్తలు