కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. 4 రోజుల్లో రూ.15.78 లక్షల కోట్లు ఆవిరి!

24 Dec, 2022 07:51 IST|Sakshi

కోవిడ్‌ భయాలకు తోడు

వడ్డీరేట్ల పెంపు భయాలు

మూడు నెలల్లో అతిపెద్ద నష్టం

60 వేల దిగువకు సెన్సెక్స్‌

18,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ

రెండు నెలల కనిష్టానికి సూచీలు 

అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు

ముంబై: కోవిడ్‌ భయాలకు తోడు తాజాగా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు భయాలు తెరపైకి రావడంతో శుక్రవారం స్టాక్‌ సూచీలు కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ విస్తృత స్థాయిలో మార్కెట్లో అన్ని రంగాలలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 60 వేల స్థాయిని, నిఫ్టీ 18 వేల స్టాయిలను కోల్పోయాయి. మార్కెట్‌ ముగిసే సెన్సెక్స్‌ 981 పాయింట్లు క్షీణించి 60 వేల దిగువన 59,845 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 321 పాయింట్లు నష్టపోయి 17,807 వద్ద నిలిచింది.

మధ్య, చిన్న తరహా షేర్లలో నెలకొన్న అమ్మకాల సునామీతో బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 4.11%, మిడ్‌క్యాప్‌ సూచీ 3.40 చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.706 కోట్లు షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,399 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో థాయ్‌లాండ్‌ తప్ప అన్ని దేశాల సూచీలు నష్టాల రెండున్నర శాతం వరకు క్షీణించాయి. యూరప్‌ మార్కెట్లు ఒకటిన్నర శాతం పతనమయ్యాయి. అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు ఒకశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో ఈ వారం సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,493 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్లు కోల్పోయాయి.

4 రోజుల్లో రూ.15.78 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్‌ నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో 1961 పాయింట్ల(మూడుశాతానికి పైగా) పతనంతో స్టాక్‌ మార్కెట్లో భారీగా సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.15.78 లక్షల కోట్లు తగ్గి రూ. 272.12 లక్షల కోట్లకు చేరింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్‌ షేర్ల భారీ పతనం  ప్రభుత్వరంగ షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 14%, యూనియన్‌ బ్యాంక్‌ 10.57%, సెంట్రల్‌ బ్యాంక్, యూకో బ్యాంక్‌ షేర్లు పదిశాతం, మహారాష్ట్ర బ్యాంక్, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 8–7% చొప్పున నష్టపోయాయి. కెనరా బ్యాంక్‌. పీఎస్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ షేర్లు 5 నుంచి మూడుశాతం పతనమయ్యాయి. ఫలితంగా  నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 6.5% నష్టపోయింది. 

మార్కెట్లో మరిన్ని సంగతులు 
► లిస్టింగ్‌ తొలిరోజే ల్యాండ్‌మార్క్‌ కార్స్‌ షేరు డీలాపడింది. ఇష్యూ ధర (రూ.506)తో పోలిస్తే 7% డిస్కౌంట్‌తో రూ.471 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 12% క్షీణించి రూ.446 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి పదిశాతం నష్టంతో రూ.456 వద్ద స్థిరపడింది.  
► అబాన్స్‌ హోల్డింగ్స్‌ కూడా ఇష్యూ ధర (రూ.270)తో పోలిస్తే 1% నష్టంతో ఫ్లాట్‌గా రూ.273 వద్ద లిస్టయ్యింది. మార్కెట్‌ పతనంలో భాగంగా ట్రేడింగ్‌లో 20% క్షీణించి రూ.216 అప్పర్‌ సర్క్యూట్‌ తాకి ముగిసింది.

చదవండి: బీభత్సమైన ఆఫర్‌: జస్ట్‌ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్‌!

మరిన్ని వార్తలు