మళ్లీ మార్కెట్ల పతనం

11 Jan, 2023 07:18 IST|Sakshi

సెన్సెక్స్‌ 632 పాయింట్లు డౌన్‌ 

ఇంట్రాడేలో 60,000 దిగువకు

187 పాయింట్లు పడిన నిఫ్టీ 

18,000 దిగువన ముగింపు 

ముంబై: షార్ట్‌ కవరింగ్‌తో ముందురోజు ర్యాలీ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి పతన బాట పట్టాయి. సెన్సెక్స్‌ 632 పాయింట్లు కోల్పోయి 60,115 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 809 పాయింట్లవరకూ జారి 59,938కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 187 పాయింట్లు పడిపోయి 17,914 వద్ద స్థిరపడింది. వెరసి సాంకేతికంగా కీలకమైన 18,000 స్థాయిని కోల్పోయింది. బ్యాంకింగ్‌ కౌంటర్లతోపాటు ఇతర బ్లూచిప్స్‌లో ఊపందుకున్న అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి.

అయితే డాలరుతో మారకంలో వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ పుంజుకోవడం గమనార్హం! యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ ప్రసంగించనున్న నేపథ్యంలో మార్కెట్లలో తాజా అమ్మకాలు నమోదైనట్లు మెహతా ఈక్విటీస్‌ రీసెర్చ్‌ విశ్లేషకులు ప్రశాంత్‌ తాప్సీ పేర్కొన్నారు. గత వారం చివర్లో వరుసగా మూడు రోజులు దేశీ స్టాక్‌ మార్కెట్లు క్షీణ పథంలో సాగిన విషయం విదితమే. 

విదేశీ ఎఫెక్ట్‌ 
నేటి(10న) ట్రేడింగ్‌లో యూరోపియన్‌ మార్కెట్లు నేలచూపులకే పరిమితంకావడం, అంతకుముందు యూఎస్, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు కొటక్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ రిటైల్‌ హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు విదేశీ అంశాలకు ప్రభావితమైనట్లు తెలియజేశారు. సెన్సెక్స్‌ దిగ్గజాలలో ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రాటెక్‌ సిమెంట్, బజాజ్‌ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఆర్‌ఐఎల్, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్‌ ప్రధానంగా నష్టపోయాయి. అయితే టాటా మోటార్స్, పవర్‌ గ్రిడ్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఎంఅండ్‌ఎం బలపడ్డాయి. ముందురోజు అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3) ఫలితాలు ప్రకటించిన టీసీఎస్‌ 1 శాతం వెనకడుగు వేసింది. 

చిన్న షేర్లు డీలా 
బీఎస్‌ఈలో టెలికం, సర్వీసులు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులు, టెక్నాలజీ, కమోడిటీస్, రియల్టీ రంగాలు 1.6–0.7 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు మెటల్, హెల్త్‌కేర్, ఆటో, ఆయిల్‌– గ్యాస్‌ స్వల్పంగా బలపడ్డాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.5 శాతం స్థాయిలో డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 2189 నష్టపోగా.. 1329 లాభపడ్డాయి. సోమవారం రూ. 203 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మరో రూ. 2,109 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మాత్రం రూ. 1,807 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.  

స్టాక్‌ హైలైట్స్‌ 
► ఈ ఏడాది తొలి అర్ధభాగంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించిన ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌ ఇన్‌ఫ్రా షేరు 14 శాతం దూసుకెళ్లి ఏడేళ్ల గరిష్టం రూ. 203కు చేరింది.  
► క్యూ3లో జేఎల్‌ఆర్‌ హోల్‌సేల్‌ అమ్మకాలు ఊపందుకోవడంతో టాటా మోటార్స్‌ షేరుకి డిమాండ్‌ పెరిగింది. పతన మార్కెట్లోనూ 6 శాతం జంప్‌చేసి రూ. 413 వద్ద ముగిసింది. 
►సెర్బియన్‌ సంస్థ నోవెలిక్‌లో 54 శాతం వాటా కొనుగోలు వార్తలతో సోనా కామ్‌స్టార్‌ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 448 వద్ద ముగిసింది. 

     

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు