సెన్సెక్స్‌.. బౌన్స్‌ బ్యాక్‌!

1 Oct, 2022 07:22 IST|Sakshi

ముంబై: ఆర్‌బీఐ రెపో రేటును పెంచినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన ప్రధాన ఇండెక్సులు తదుపరి ఆర్‌బీఐ ప్రకటించిన జీడీపీ, ద్రవ్యోల్బణ అంచనాలతో దూసుకెళ్లాయి. సమయం గడిచేకొద్దీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ఆసక్తి చూపడంతో సాంకేతికంగా కీలకమైన స్థాయిలను అధిగమించాయి. సెన్సెక్స్‌ 1,017 పాయింట్లు జమ చేసుకుని 57,427 వద్ద ముగిసింది. నిఫ్టీ 276 పాయింట్లు ఎగసి 17,094 వద్ద స్థిరపడింది. కొత్త సిరీస్‌(అక్టోబర్‌) తొలి రోజు ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంచనాలకు తగ్గట్లే 0.5 శాతం రెపో పెంపు, రూపాయి పుంజుకోవడం వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

బ్యాంకింగ్, మెటల్‌ జోరు..: ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, రియల్టీ, ఆటో, వినియోగ వస్తువులు 3–1.5% మధ్య ఎగశాయి. హిందాల్కో, ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్, బజాజ్‌ ఫిన్‌ ద్వయం, కొటక్‌ బ్యాంక్, టైటన్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, టాటా స్టీల్, ఐసీఐసీఐ, యూపీఎల్, మారుతీ, యాక్సిస్‌ 5.6–2.3% మధ్య జంప్‌చేశాయి.  
►5జీ సేవలు ప్రారంభంకానుండటంతో ఎయిర్‌టెల్‌ షేరు సరికొత్త గరిష్టం రూ. 809ను తాకింది. చివరికి 4.6% జంప్‌చేసి రూ. 800 వద్ద ముగిసింది. 
►ప్రమోటర్‌ సంస్థ స్పిట్జీ ట్రేడ్‌ 40 లక్షల షేర్లను కొనుగోలు చేసిన వార్తలతో అదానీ గ్రీన్‌ ఎనర్జీ 12.5 శాతం దూసుకెళ్లింది. రూ. 2,253 వద్ద నిలిచింది. తొలుత రూ. 2,405కు ఎగసింది. 
►పవర్‌గ్రిడ్‌ నుంచి రూ. 333 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందిన వార్తలతో బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 1,192 వద్ద ముగిసింది. 

చదవండి: ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!

మరిన్ని వార్తలు