స్టాక్‌ మార్కెట్‌: 3 రోజుల నష్టాలకు చెక్‌

20 Sep, 2022 06:59 IST|Sakshi

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

సెన్సెక్స్‌ 300 పాయింట్లు అప్‌

59,000 అధిగమించిన ఇండెక్స్‌

92 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

ముంబై: స్టాక్‌ మార్కెట్లలో మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో రోజంతా లాభాలతో కదిలాయి. సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించి 59,141 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 92 పాయింట్లు ఎగసి 17,622 వద్ద స్థిరపడింది. వెరసి ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో నిలిచాయి. ప్రారంభంలో వెనకడుగు వేసినప్పటికీ వెనువెంటనే పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలు 2–1 శాతం మధ్య లాభపడి మార్కెట్లకు దన్నునిచ్చాయి. రియల్టీ 1 శాతం, మెటల్‌ 0.5 శాతం చొప్పున నీరసించాయి.

బ్లూచిప్స్‌ తీరిలా..
నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ, నెస్లే, బజాజ్‌ ఫిన్, హెచ్‌డీఎఫ్‌సీ, దివీస్, ఐటీసీ, యాక్సిస్, యూపీఎల్, ఐషర్, మారుతీ, ఇన్ఫోసిస్‌ 3.4–1 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా, పవర్‌గ్రిడ్, సిప్లా, ఐసీఐసీఐ 2.4–0.8 శాతం మధ్య నష్టపోయాయి. 

చిన్న షేర్లు వీక్‌ 
మార్కెట్లు బలపడినప్పటికీ చిన్న షేర్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీంతో బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ ఇండెక్సులు 0.16 శాతం చొప్పున డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,973 నష్టపోగా.. 1,655 లాభపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 312 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 95 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. 

తాత్కాలికమే.. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో ఇకపై మార్కెట్లు ఊగిసలాటకు లోనుకావచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్ధ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. బుధవారం ప్రకటించనున్న సమీక్షలో ఫెడ్‌ 0.75% వడ్డీ రేటును పెంచే అంచనాలున్నట్లు తెలియజేశారు. 

స్టాక్‌ హైలైట్స్‌ 
► హెర్క్యులెస్‌ హోయిస్ట్స్‌ షేరు బిజినెస్‌ల విడదీత వార్తలతో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 218 వద్ద ఫ్రీజయ్యింది. 
► షుగర్, ఇంజనీరింగ్‌ విభాగాలుగల త్రివేణీ ఇంజనీరింగ్‌ షేరు 17% జంప్‌చేసి 288 వద్ద ముగిసింది. 
► వందే భారత్‌ సెమీ హైస్పీడ్‌ రైళ్ల కోసం మాడ్యులర్‌ ఇంటీరియర్స్‌కు రూ. 113 కోట్ల విలువైన ఆర్డర్లు లభించడంతో ఇండోనేషనల్‌ షేరు 20% అప్పర్‌ సర్క్యూట్‌ రూ. 404 వద్ద ముగిసింది. 
► అదానీ గ్రూప్‌ తాజాగా రూ. 20,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించడంతో అంబుజా సిమెంట్స్‌ 9% దూసుకెళ్లి 565 వద్ద ముగిసింది.

చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ చవకైన ప్లాన్‌.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్‌ లాస్ట్‌ డేట్‌ ఇదే!

మరిన్ని వార్తలు