రెండో రోజూ మార్కెట్ల జోరు

19 Jan, 2023 10:39 IST|Sakshi

ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్‌ 390 పాయింట్లు జంప్‌చేసి 61,046 వద్ద నిలిచింది. వెరసి మళ్లీ 61,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ 112 పాయింట్లు జమ చేసుకుని 18,165 వద్ద ముగిసింది. అయితే తొలుత మార్కెట్లు కొంతమేర డీలా పడ్డాయి. వెనువెంటనే ఊపందుకుని చివరివరకూ పటిష్టంగా కదిలాయి.

ఇటీవల అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం స్వల్ప కొనుగోళ్లు చేపట్టడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఆసియా, యూరోపియన్‌ మార్కెట్ల సానుకూలతలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. మంగళవారం(17న) సైతం సెన్సెక్స్‌ 563 పాయింట్లు ఎగసిన విషయం విదితమే. కాగా.. తొలుత సెన్సెక్స్‌ 60,569 వద్ద కనిష్టాన్ని తాకినప్పటికీ ఆపై 61,110 వరకూ దూసుకెళ్లింది. ఈ బాటలో నిఫ్టీ 18,184– 18,032 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. డాలరుతో మారకంలో రూపాయి బౌన్స్‌బ్యాక్‌ కావడం మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

మెటల్స్‌ జూమ్‌ 
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 1.7 శాతం పుంజుకోగా, ఫార్మా, ప్రయివేట్‌ బ్యాంకింగ్‌ 0.6 శాతం చొప్పున లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.25 శాతం వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, యూపీఎల్, విప్రో, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఎయిర్‌టెల్, జేఎస్‌డబ్ల్యూ, దివీస్, గ్రాసిమ్‌ 3–1 శాతం మధ్య లాభపడ్డాయి.

రూపాయి స్పీడ్‌...
డాలరుతో మారకంలో వరుసగా మూడు రోజుల నష్టాలకు దేశీ కరెన్సీ చెక్‌ పెట్టింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 28 పైసలు లాభపడి 81.41 వద్ద ముగిసింది. అయితే రూపాయి తొలుత 81.80 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి డాలరు ఇండెక్స్‌ వెనకడుగు వేయడం, దేశీ ఈక్విటీలు ఊపందుకోవడంతో 81.25 వరకూ బలపడింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 0.5 శాతం క్షీణించి 101.93కు చేరడం రూపాయికి హుషారునిచ్చినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

స్టాక్‌ హైలైట్స్‌ 
►ఈ ఏడాది తొలి 9 నెలల్లో ఆదాయం 41 శాతం ఎగసి రూ. 3,384 కోట్లను తాకడంతో ల్యాండ్‌మార్క్‌ కార్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 587 వద్ద ముగిసింది. తొలుత రూ. 599 వరకూ ఎగసింది. 2022 డిసెంబర్‌ 23న లిస్టయిన తదుపరి ఇదే గరిష్టం! 
►క్యూ3 ఫలితాలపై అంచనాలతో ఉషా మార్టిన్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 191 వద్ద ముగిసింది. తొలుత రూ. 199 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. 
► గత మూడు వారాల్లో 20% ర్యాలీ చేసిన యురేకా ఫోర్బ్స్‌ షేరు బీఎస్‌ఈలో తొలుత 1.5 శాతం బలపడి రూ. 537 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. చివరికి అమ్మకాలు పెరిగి 1.6% నష్టంతో రూ. 521 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు