మూడు వారాల్లో అతిపెద్ద లాభం

20 Dec, 2022 09:10 IST|Sakshi

కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు

యూరప్‌ మార్కెట్ల నుంచి సానుకూలతలు

రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌

సెన్సెక్స్‌ 468 పాయింట్లు ప్లస్‌

18,400 పైకి నిఫ్టీ

ముంబై: బ్యాంకింగ్, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ షేర్లు పరుగులు తీయడంతో స్టాక్‌ సూచీలు మూడు వారాల్లోనే అతిపెద్ద ఒకరోజు లాభాన్ని సోమవారం నమోదు చేశాయి. యూరప్‌ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. గతవారంలో నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారం అతి స్వల్ప ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఆసియా మార్కెట్ల రికవరీ, యూరప్‌ మార్కెట్ల సానుకూల వార్తలతో సూచీలు రోజంతా పటిష్టమైన లాభాలతో దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌ ఉదయం 61,405 వద్ద మొదలైంది.

ఇంట్రాడేలో 507 పాయింట్లు బలపడి 61,845 గరిష్టాన్ని తాకింది. చివరికి 468 పాయింట్ల పెరిగి 61,806 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్లు ర్యాలీ చేసి 18,420 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 163 పాయింట్లు పెరిగి 18432 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. వచ్చే ఏడాది(2023)లో అమెరికా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) వృద్ధి నెమ్మదించే అవకాశాలు ఉండొచ్చనే అంచనాలతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అలాగే ప్రభుత్వరంగ బ్యాంక్స్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ అరశాతం, స్మాల్‌ సూచీ 0.30% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.538 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.687 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు.   

మార్కెట్లో మరిన్ని సంగతులు  
► కెఫిన్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూకు తొలిరోజు 55 శాతం స్పందన లభించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 2.27 కోట్ల షేర్లను జారీ చేయగా, 1.29 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి.  
► గడిచిన నెలరోజుల్లో నైకా విక్రయాలు భారీగా తగ్గిపోవడం ఈ కంపెనీ షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. బీఎస్‌ఈ ఇంట్రాడేలో నాలుగు శాతానికి పైగా పతనమై రూ.158 వద్ద జీవితకాల కనిష్టానికి దిగివచి్చంది. ఆఖరికి మూడుశాతం నష్టంతో రూ.163 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు