స్టాక్‌ మార్కెట్‌: ప్రారంభంలో హుషారు.. చివర్లో నీరసం

19 Nov, 2022 07:54 IST|Sakshi

సెన్సెక్స్‌ 87 పాయింట్లు డౌన్‌ 

61,663 వద్ద ముగిసిన ఇండెక్స్‌ 

ఆటో, ఆయిల్, హెల్త్‌కేర్‌ డీలా 

పీఎస్‌యూ బ్యాంక్స్‌ జూమ్‌

ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలా పడ్డాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ రోజంతా నష్టాలలోనే కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 87 పాయింట్లు క్షీణించి 61,663 వద్ద ముగిసింది. నిఫ్టీ 36 పాయింట్లు తక్కువగా 18,308 వద్ద స్థిరపడింది. తొలుత హుషారు చూపిన మార్కెట్లు వెనువెంటనే నీరసించాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో మిడ్‌ సెషన్‌కల్లా సెన్సెక్స్‌ 61,337కు, నిఫ్టీ 18,210 దిగువకు చేరాయి. ఈ వారం ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో నిలిచాయి. నికరంగా సెన్సెక్స్‌ 132 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయాయి.

ఆటో బ్లూచిప్స్‌ వీక్‌: ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఫార్మా రంగాలు 1.2–0.6 శాతం మధ్య క్షీణించాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.5 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్, ఐషర్, మారుతీ, సిప్లా, కోల్‌ ఇండియా, టాటా కన్జూమర్, ఎయిర్‌టెల్, యూపీఎల్‌ 2.5–1 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు హెచ్‌సీఎల్‌ టెక్, ఏషియన్‌ పెయింట్స్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, కొటక్‌ బ్యాంక్‌ 1.2–0.4 శాతం మధ్య బలపడ్డాయి. 
చిన్న షేర్లూ: మార్కెట్లను మించుతూ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,137 నష్టపోగా.. 1,360 లాభపడ్డాయి.

చదవండి: QR Code On Cylinders: కేంద్రం సంచలన నిర్ణయం, గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు శుభవార్త

మరిన్ని వార్తలు