పరిమిత శ్రేణిలో ట్రేడింగ్‌

29 Dec, 2022 11:18 IST|Sakshi

ముంబై: ట్రేడింగ్‌లో లాభ, నష్టాల మధ్య పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. గత రెండు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ(నేడు)కి ముందురోజు ట్రేడర్లు అప్రమత్తత వహించారు. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఉదయం సెన్సెక్స్‌ 115 పాయింట్ల నష్టంతో 60,812 వద్ద మొదలైంది.

ట్రేడింగ్‌లో 362 పాయింట్ల పరిధిలో 61,075 వద్ద గరిష్టాన్ని, 60,714 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 18 పాయింట్ల నష్టంతో 60,910 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో 18,132 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 18,173 – 18,068 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. ఆఖరికి పది పాయింట్లు పతనమై 18,122 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ షేర్లు రాణించాయి. కాగా, డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఏడు పైసలు పెరిగి 82.80 స్థాయి వద్ద స్థిరపడింది.  

మార్కెట్లో మరిన్ని సంగతులు 
► ఇండియా పెస్టిసైడ్స్‌ షేరు తొమ్మిదిశాతం లాభపడి రూ.263 వద్ద స్థిరపడింది. తన అనుబంధ షల్విస్‌ స్పెషాలిటీస్‌ ఉత్తరప్రదేశ్‌లో తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు పర్యావరణ అనుమతి లభించడం షేరు ర్యాలీకి కారణమైంది. ట్రేడింగ్‌లో 11% బలపడి రూ.269 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 
► మాల్దీవులు దేశంలో యూటీఎఫ్‌ హార్బర్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధి పనులను ఆర్‌వీఎన్‌ఎల్‌ దక్కించుకోవడంతో ఈ కంపెనీ షేరు ఐదు శాతం పెరిగి రూ.67 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.

చదవండి: దేశంలో తగ్గని ఐపీవో జోరు..ఐపీవోకి సిద్దంగా దిగ్గజ కంపెనీలు

మరిన్ని వార్తలు