రంకెలేస్తున్న బుల్‌..60 వేలు దాటిన సెన్సెక్స్‌!

18 Aug, 2022 06:54 IST|Sakshi

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో బుల్‌ స్థిరమైన ర్యాలీతో సెన్సెక్స్‌ సూచీ ఏప్రిల్‌ ఐదో తేదీ తర్వాత మరోసారి 60,000 స్థాయిని అధిగమించింది. లాభాల స్వీకరణతో ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్‌ 418 పాయింట్లు బలపడి 60,260 వద్ద స్థిరపడింది.

మొత్తం 30 షేర్లలో ఏడు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 17,944 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌కిది వరుసగా నాలుగో రోజూ, నిఫ్టీకి ఏడోరోజూ లాభాల ముగింపు. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్‌ ఇండెక్సులు అరశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,347 కోట్ల షేర్లను కొనడంతో 13వ రోజూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.510 కోట్ల షేర్లను అమ్మారు. ఆసియాలో కొరియా ఇండెక్స్‌ తప్ప మిగిలిన అన్ని దేశాల స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి.

బ్రిటన్‌ ద్రవ్యోల్బణం నలభై ఏళ్ల గరిష్టస్థాయిలో నమోదవడంతో యూరప్‌ మార్కెట్లు 1–2% నష్టపోయాయి. యూఎస్‌ రిటైల్‌ సేల్స్, ఫెడ్‌ పాలసీ రిజర్వ్‌ జూలై సమావేశపు మినిట్స్‌ వెల్లడికి ముందు అమెరికా మార్కెట్లు అరశాతం స్వల్ప నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 29 పైసలు బలపడి 79.45 వద్ద ముగిసింది.   

నాలుగురోజుల్లో రూ.7.41 లక్షల కోట్లు  
సెన్సెక్స్‌ 4 రోజుల ర్యాలీతో రూ.7.41 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ.279 లక్షల కోట్లకు చేరింది.  

మార్కెట్లో మరిన్ని సంగతులు  
►నాలుగేళ్లకు సరిపడా 5జీ స్పెక్ట్రం వేలం సొమ్మును ముందుగానే  చెల్లించడంతో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు రెండున్నర శాతం లాభపడి రూ.722 వద్ద స్థిరపడింది.  

►బోర్డు షేర్ల బోనస్‌ ఇష్యూను పరిగణనలోకి తీసుకోవడంతో భారత్‌ గేర్స్‌ షేరు 18% లాభపడి రూ.178 వద్ద నిలిచింది.

మరిన్ని వార్తలు