బుల్‌.. కొత్త రికార్డుల్‌!

4 Aug, 2021 00:24 IST|Sakshi

చరిత్రాత్మక గరిష్టాలను నమోదుచేసిన సూచీలు 

ఆర్థిక రికవరీ ఆశలతో కొనుగోళ్లుసెన్సెక్స్‌ లాభం 873 పాయింట్లు 16,000 వేల శిఖరంపై నిఫ్టీ  ఆల్‌టైం హైకి ఇన్వెస్టర్ల సంపద

ముంబై: స్టాక్‌ మార్కెట్లో మంగళవారం రికార్డుల మోత మోగింది. ఆర్థిక రికవరీ ఆశలతో సెన్సెక్స్, నిఫ్టీలు చరిత్రాత్మక స్థాయిలను లిఖించాయి. దేశీయ మార్కెట్లో నెలకొన్న సానుకూలతలను ఇన్వెస్టర్లు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే కొనుగోళ్లకు తెరలేపారు. మార్కెట్‌ ముగిసే వరకు కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సూచీలు ఎలాంటి తడబాటు లేకుండా ఆల్‌టైం హై స్థాయిల వైపు పరుగులు పెట్టాయి. ఈ క్రమంలో ఇంట్రాడే, ముగింపులోనూ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 937 పాయింట్లు ఎగిసి 52,951 స్థాయిని అందుకుంది. చివరకి 873 పాయింట్ల లాభంతో 53,823 వద్ద ముగిసింది. నిఫ్టీ తొలిసారి 16000 శిఖరాన్ని అధిరోహించింది. ఒకదశలో 262 పాయింట్లను ఆర్జించి 16,147 స్థాయిని చేరుకుంది. మార్కెట్‌ ముగిసేసరికి 245 పాయింట్ల లాభంతో 16,130 వద్ద స్థిరపడింది.

మే 31 తర్వాత సూచీలు ఒక రోజులో అతిపెద్ద ర్యాలీని చేయడం ఇదే తొలిసారి. సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లలో మూడు షేర్లు, నిఫ్టీ 50 సూచీలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి.  ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు రాణించి రికార్డు ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. మెటల్, మీడియా షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు 13 సెషన్ల తర్వాత తొలిసారి కొనుగోళ్లు జరిపారు. నికరంగా రూ.2,117 కోట్ల ఈక్విటీ షేర్లను కొన్నారు. అనూహ్యంగా దేశీయ ఇన్వెస్టర్లు రూ.299 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇటీవల ఫారెక్స్‌ బలహీనంగా ట్రేడ్‌ అవుతున్న రూపాయి విలువ ఆరు పైసలు బలపడి 74.28 వద్ద స్థిరపడింది.  

రికార్డు ర్యాలీకి కారణాలు 
మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు  
దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించగలిగాయి. ఈ ఏడాది జూన్‌లో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 8.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. తయారీ రంగం మూడునెలల తర్వాత జూలైలో సానుకూల వృద్ధి రేటును సాధించింది. జీఎస్‌టీ వసూళ్లు జూలైలో మళ్లీ రూ.లక్ష కోట్లను మార్కును అందుకుని రూ.1.16 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇదే జూలైలో భారత ఎగుమతులు 47.91 శాతం పురోగతితో 35.17 బిలియన్‌ డాలర్లకు చేరాయి. స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగ్గా నమోదుకావడంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ అనుకున్న సమయం కంటే మరింత వేగవంతం అవుతుందని, అలాగే ఆర్‌బీఐ వడ్డీరేట్ల జోలికెళ్లదనే అంచనాలు నెలకొన్నాయి.  

మెరుగైన కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు 
కార్పొరేట్‌ తొలి త్రైమాసిక ఆర్థిక పలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించాయి. కరోనా రెండో దశ కర్ఫ్యూ ఆంక్షల ప్రతికూలతలను తట్టుకొని అత్యుత్తమ పనితీరును కనబరిచినట్లు ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ యాజమాన్యాలు తెలిపాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీలో భాగంగా వచ్చే త్రైమాసికాల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తామనే విశ్వాసం వ్యక్తం చేశాయి. కంపెనీలు అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో పాటు పాజిటివ్‌ అవుట్‌లుక్‌ ధోరణి ప్రకటన మార్కెట్‌ మూమెంట్‌ను మరింత ఉత్సాహపరిచింది.  

ఐపీఓ మార్కెట్‌ నుంచి మద్దతు 
ప్రాథమిక మార్కెట్లో నెలకొన్న ఐపీఓల సందడి స్టాక్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచింది. ఈ ఏడాదిలో పలు కంపెనీలు నిధుల సమీకరణకు ఇష్యూలను చేపట్టడంతో అనేక మంది కొత్త ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లోకి అడుగుపెట్టి విరివిగా కొనుగోళ్లు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

కార్పొరేట్‌ సంస్థలు ప్రకటించిన మెరుగైన ఆర్థిక ఫలితాల నుంచి బుల్స్‌ ఫండమెంటల్‌ మద్దతును అందుకున్నాయి. తాజాగా నమోదైన స్థూల ఆర్థిక గణాంకాలు రికార్డు ర్యాలీకి తోడ్పాటును అందించాయి.  ఇదే జోరు కొనసాగితే 16,300–16,400 శ్రేణిని పరీక్షిస్తుంది. దిగువ స్థాయిలో 15,750 వద్ద బలమైన మద్దతును కలిగి ఉంది.
– వీకే విజయకుమార్, జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ 

జీఎస్‌టీ వసూళ్లు పెరగడం, తయారీ రంగం ఊపందుకోవడం, ఎగుమతుల వృద్ధిరేటు పెరగడం తదితర అంశాలతో మార్కెట్‌లో మరికొంతకాలం సానుకూలతలు కొనసాగవచ్చు. ఇదే సమయంలో డెల్టా వేరియంట్‌ కేసుల పెరుగుదల భయాలు మార్కెట్‌ను వెంటాడుతున్నాయి. సూచీలు రికార్డుల స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదు. కావున ఇన్వెస్టర్లు అప్రమత్తతతో కూడిన ట్రేడింగ్‌ చేయడం అవసరం.
– గౌరవ్‌ గార్గ్, క్యాపిటల్‌ వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ హెడ్‌

ఇన్వెస్టర్ల సంపద @ 240 లక్షల కోట్లు 
సూచీల రికార్డు ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపద సైతం సరికొత్త గరిష్టానికి చేరుకుంది. మార్కెట్‌ వరుస లాభాల ముగింపుతో రెండురోజుల్లో రూ.4.54 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.240 లక్షల కోట్లకు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపద అంశంలో ఈ విలువ సరికొత్త రికార్డు.  

విదేశీ ఇన్వెస్టర్ల వాటా.. రూ.42 లక్షల కోట్లకు!
ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన కంపెనీలలో ప్రమోటర్లు, విదేశీ ఇన్వెస్టర్లు, దేశీ ఫండ్స్, రిటైల్‌ ఇన్వెస్టర్ల తీరు ఎలా ఉన్నదంటే... 
2020 డిసెంబర్‌కల్లా ఎన్‌ఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) వాటా 22.74 శాతానికి చేరింది. ఇది ఐదేళ్ల గరిష్టంకాగా.. ఇందుకు ప్రధానంగా గతేడాది(2020–21)మూడో క్వార్టర్‌(అక్టోబర్‌–డిసెంబర్‌)లో రికార్డ్‌ స్థాయిలో రూ. 1.42 లక్షల కోట్ల పెట్టుబడులను కుమ్మరించడం సహకరించింది. గతేడాది క్యూ2 (జూలై–సెప్టెంబర్‌)కల్లా ఈ వాటా 21.51 శాతంగా నమోదైంది. ఇక విలువరీత్యా చూస్తే 2020 డిసెంబర్‌కల్లా ఎఫ్‌పీఐల వాటా విలువ రూ. 41.83 లక్షల కోట్లను తాకింది. ఇది స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డ్‌కావడం విశేషం! క్యూ2తో పోలిస్తే వాటా విలువ ఏకంగా 29 శాతం వృద్ధి సాధించింది. 
దేశీ స్టాక్‌ మార్కెట్లో ప్రమోటర్ల తరువాత లిస్టెడ్‌ కంపెనీలలో ఎఫ్‌పీఐలు అతిపెద్ద నాన్‌ప్రమోటర్‌ వాటాదారులుగా నిలుస్తున్న విషయం విదితమే. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు) వాటా 2020 డిసెంబర్‌కల్లా 13.55 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్‌లో ఈ వాటా 13.94 శాతంగా నమోదైంది. మ్యూచువల్‌ ఫండ్స్, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలు, పెన్షన్‌ ఫండ్స్‌ తదితరాలను డీఐఐలుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. 
ఇక రిటైల్‌ ఇన్వెస్టర్ల విషయానికి వస్తే 2020 డిసెంబర్‌కల్లా ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో వాటా 6.9 శాతానికి నీరసించింది. సెప్టెంబర్‌ చివరికి ఈ వాటా 7.01 శాతంగా నమోదైంది. 
ఈ కాలంలో ప్రైవేట్‌ సంస్థల ప్రమోటర్ల వాటా 45.38% నుంచి 44.46%కి తగ్గింది. ఈ బాటలో పీఎస్‌యూలలో ప్రమోటర్‌ అయిన ప్రభుత్వ వాటా సైతం 2020 డిసెంబర్‌కల్లా 5.08 శాతానికి పరిమితమైంది. ఇది చరిత్రాత్మక కనిష్టంకాగా.. సెప్టెంబర్‌ చివరికల్లా ఈ వాటా 5.1 శాతంగా నమోదైంది.  

నిఫ్టీ–500లో తాజా పరిస్థితి ఇలా 
ఎన్‌ఎస్‌ఈలో టాప్‌–500 కంపెనీలను పరిగణిస్తే.. ఎఫ్‌పీఐల వాటా 2021 మార్చికల్లా 1.6% బలపడి 22.3%కి చేరింది. ఇదే సమయంలో డీఐఐల వాటా 0.5% క్షీణించి 14.2%కి పరిమితమైంది. ఇది గత ఏడు త్రైమాసికాలలోనే కనిష్టం కావడం గమనార్హం! 

మరిన్ని వార్తలు