7 రోజుల ర్యాలీకి బ్రేక్‌

20 Oct, 2021 00:43 IST|Sakshi

లాభాల స్వీకరణతో అమ్మకాలు 

కొత్త గరిష్టాల నుంచి వెనకడుగు 

ఇంట్రాడేలో 62,245కు సెన్సెక్స్‌ 

ఓపెనింగ్‌లో 18,600ను దాటిన నిఫ్టీ 

చివరికి స్వల్ప నష్టాలతో ముగింపు 

రియల్టీ, బ్యాంక్స్, ఎఫ్‌ఎంసీజీ డౌన్‌

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్ల ఏడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇండెక్సులు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్‌ 50 పాయింట్లు నీరసించి 61,716 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 58 పాయింట్లు క్షీణించి 18,419 వద్ద ముగిసింది. అయితే బుల్‌ జోష్‌ను కొనసాగిస్తూ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 480 పాయింట్లు జంప్‌చేసి 62,245కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 18,604ను తాకింది. వెరసి మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి.  

ఆదుకున్న ఐటీ..: ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ రంగాలు 5–2.5 శాతం మధ్య నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్‌ 2.2 శాతం బలపడటం ద్వారా మార్కెట్లను ఆదుకుంది. దీంతో నష్టాలు పరిమితమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐటీసీ, టాటా మోటార్స్, ఐషర్, హెచ్‌యూఎల్, టైటన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, అల్ట్రాటెక్, దివీస్, యూపీఎల్, ఇండస్‌ఇండ్, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ 6.3–2 శాతం మధ్య పతనమయ్యాయి.

అయితే మరోపక్క టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్, కొటక్‌ బ్యాంక్, బజాజ్‌ ఫిన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్‌ టెక్, ఆర్‌ఐఎల్, ఎంఅండ్‌ఎం, విప్రో 4.3–0.6 శాతం మధ్య బలపడ్డాయి. కొద్ది రోజులుగా దేశీ మార్కెట్ల దూకుడు నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

చిన్న షేర్లు వీక్‌ 
బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 2 శాతం స్థాయిలో క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 2,427 డీలాపడగా.. కేవలం 935 లాభాలతో ముగిశాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 0.7 శాతం పుంజుకుని దాదాపు 85 డాలర్లకు చేరింది. ఇది సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 506 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,578 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.  

ఎల్‌అండ్‌టీ షేర్ల స్పీడ్‌ 
వివిధ ప్రోత్సాహకర అంశాల నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో 3 లిస్టెడ్‌ కంపెనీలు కొత్త గరిష్టాలను తాకాయి.  
క్యూ2లో ప్రోత్సాహకర ఫలితాల సాధనతో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ ఎన్‌ఎస్‌ఈలో 17 శాతం పురోగమించింది. రూ. 6,900 వద్ద ముగిసింది. 
క్యూ2 ఫలితాలపై అంచనాలతో ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌ 7.5 శాతం జంప్‌చేసి రూ. 5,215 వద్ద ముగిసింది. తొలుత రూ. 5,549కు చేరింది. 
ఇటీవలి భారీ ఆర్డర్లతో ఎల్‌అండ్‌టీ షేరు 3.3 శాతం లాభపడి రూ. 1,848 వద్ద ముగిసింది.

ఐఆర్‌సీటీసీకి షాక్‌
లాభాల స్వీకరణ ఐఆర్‌సీటీసీ కౌంటర్‌ను దెబ్బతీసింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఇంట్రా డేలో ఈ షేరు 15 శాతం పడిపోయి రూ. 4,996కు చేరింది. చివరికి 7% నష్టంతో  రూ. 5,455 వద్ద ముగిసింది. అయితే తొలుత 9% జంప్‌చేసి, జీవితకాల గరిష్టం రూ. 6,396ను తాకింది. వెరసి కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారి రూ. లక్ష కోట్లను అధిగమించింది.

అయితే ఆపై ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో కుప్పకూలింది. గత ఐదు రోజుల్లో ఈ షేరు 31 శాతం ర్యాలీ చేయడం ఇందుకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. గతేడాది(2020) నవంబర్‌ 4న ఐఆర్‌సీటీసీ షేరు రూ.1,290 వద్ద 52 వారాల కనిషాన్ని తాకింది. 

మరిన్ని వార్తలు