18000 దిగువకు నిఫ్టీ

17 Nov, 2021 03:48 IST|Sakshi

సెన్సెక్స్‌ నష్టం 396 పాయింట్లు 

కొనసాగిన ద్రవ్యోల్బణ భయాలు 

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు 

సెంటిమెంట్‌ను దెబ్బతీసిన ఆర్‌బీఐ వ్యాఖ్యలు 

నష్టాల మార్కెట్లోనూ దూసుకెళ్లిన ఆటో షేర్లు 

ముంబై: ద్రవ్యోల్బణ భయాలు కొనసాగడంతో స్టాక్‌ సూచీలు మంగళవారం నష్టాలను చవిచూశాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ వాల్యుయేషన్లు భారీగా పెరిగాయని కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ చేసిన వ్యాఖ్యలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ప్రపంచ మార్కెట్లలో బలహీనతలు.., ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ షేర్ల పతనం సూచీల భారీ నష్టాలకు కారణమయ్యాయి. మార్కెట్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 396 పాయింట్లను కోల్పోయి 60,322 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 110 పాయింట్ల నష్టంతో 18,000 దిగువున 17,999 వద్ద నిలిచింది. ఆటో, ఐటీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో కంపెనీలు ధరలను పెంచవచ్చనే ఆందోళనలతో పాటు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం ఉండొచ్చనే భయాలతో ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.561 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.577 కోట్ల షేర్లను కొన్నారు.

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ తొమ్మిది పైసలు బలపడి 74.37 వద్ద స్థిరపడింది.  తైవాన్‌ విషయంలో తలెత్తిన ఉద్రిక్తతలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అమెరికా, చైనా దేశాధ్యక్షులు తీర్మానం చేసుకున్నారు. దీంతో ఆసియాలోని చైనా, సింగపూర్, కొరియా స్టాక్‌ సూచీలు నష్టాల్లో.., జపాన్, ఇండోనేషియా తైవాన్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. యూరోజోన్‌ మూడో క్వార్టర్‌ జీడీపీ గణాంకాల విడుదలకు ముందు యూరప్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికా రిటైల్‌ అమ్మకాలు డేటా ప్రకటనకు ముందు యూఎస్‌ స్టాక్‌  ఫ్యూచర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. 

ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్‌...  
దేశీయ మార్కెట్‌ ఉదయం ఫ్లాట్‌గా మొదలైంది. సెన్సెక్స్‌ 36 పాయింట్ల లాభంతో 60,755 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 18,127 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతల సంకేతాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. ఫలితంగా సూచీలు క్రమంగా నష్టాల బాటపట్టాయి.

ట్రేడింగ్‌ గడిచే కొద్ది అమ్మకాల ఉధృతి పెరగడంతో ఒకదశలో సెన్సెక్స్‌ 519 పాయింట్లను కోల్పోయి 60200 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 17,959 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మిడ్‌సెషన్‌ అనంతరం కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంత రికవరీ అయ్యాయి. అయితే చివరి గంటలో పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు నష్టాల ముగింపు ఖరారైంది.  

లాభాల బాటలో ఆటో షేర్లు...  
నష్టాల మార్కెట్లోనూ ఆటో షేర్లు లాభాల బాటపట్టాయి. ఆటో పరిశ్రమను వేధిస్తున్న సెమికండెక్టర్ల సమస్య తర్వలో తీరుతుందని బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ ప్రకటన ఈ రంగ షేర్లకు కలిసొచ్చింది. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏడు శాతం దూసుకెళ్లింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, భారత్‌ ఫోర్జ్, టాటా మోటార్స్, హీరోమోటోకార్ప్, భాష్‌ లిమిటెడ్‌ షేర్లు 3–2% రాణించాయి. ఐషర్‌ మోటార్స్, టీవీఎస్‌మోటర్స్, బజాజ్‌ ఆటో షేర్లు అరశాతం పెరిగాయి.

మార్కెట్లో మరిన్ని సంగతులు
అదిరిపోయే లాభాలతో లిస్టయిన సిగాచీ ఇండస్ట్రీస్‌ షేరు జోరు రెండోరోజూ కొనసాగింది. బీఎస్‌ఈలో ఐదుశాతం దూసుకెళ్లి రూ.634 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. 
పాలసీ బజార్‌లో క్యాపిటల్‌ రీసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్వెస్ట్‌ సంస్థ వాటా  కొనడంతో 12% పెరిగి రూ.1342 వద్ద ముగిసింది.  
మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో రుచి సోయా షేరు నాలుగు శాతం లాభంతో రూ.1016 వద్ద స్థిరపడింది.  
రిలయన్స్, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్, ఎన్‌టీపీసీ, ఇండస్‌ ఇండ్‌ తదితర అధిక వెయిటేజీ షేర్లు 2.5–2% క్షీణించాయి. 

మరిన్ని వార్తలు