10 నెలల కనిష్టానికి మార్కెట్లు 

15 Jun, 2022 02:16 IST|Sakshi

మూడో రోజూ అమ్మకాలదే పైచేయి 

సెన్సెక్స్‌ 153 పాయింట్లు డౌన్‌ 

15,750 పాయింట్ల దిగువకు నిఫ్టీ 

యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ పెంపు భయాలు 

ముంబై: ఆటుపోట్ల మధ్య వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలా పడ్డాయి. చివరి సెషన్‌లో అమ్మకాలదే పైచేయి కావడంతో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 153 పాయింట్లు క్షీణించి 52,694 వద్ద నిలవగా.. 42 పాయింట్లు నీరసించిన నిఫ్టీ 15,732 వద్ద స్థిరపడింది. ఇది 10 నెలల కనిష్టంకాగా.. సెన్సెక్స్‌ ఇంతక్రితం 2021 జులై 30న మాత్రమే ఈ స్థాయికి చేరింది.

కాగా.. ప్రపంచ మార్కెట్ల బలహీనతలతో తొలుత నేలచూపులతో ప్రారంభమైన మార్కెట్లు తదుపరి బలపడ్డాయి. ట్రేడర్ల స్క్వేరప్‌ లావాదేవీలు, అందుబాటు ధరల్లోని బ్లూచిప్స్‌లో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మిడ్‌సెషన్‌కల్లా ఇండెక్సులకు ప్రోత్సాహాన్నిచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ 53,000 పాయింట్ల మైలురాయిని దాటి 53,095కు చేరింది. నిఫ్టీ సైతం 15,858 వరకూ ఎగసింది. వెరసి సెన్సెక్స్‌ 248 పాయింట్లు, నిఫ్టీ 84 పాయింట్లు చొప్పున పుంజుకున్నాయి. అయితే చివర్లో తిరిగి అమ్మకాలు ఊపందుకోవడంతో నీరసించాయి.  

బ్లూచిప్స్‌ వీక్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ఆయిల్‌ గ్యాస్, ఆటో, బ్యాంకింగ్‌ రంగాలు ప్రధానంగా 1.2–0.3 శాతం మధ్య క్షీణించగా.. రియల్టీ, మెటల్, హెల్త్‌కేర్, ఐటీ 0.8–0.2 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్, ఓఎన్‌జీసీ, హిందాల్కో, టెక్‌ మహీంద్రా, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఆర్‌ఐఎల్, మారుతీ, యూపీఎల్, బీపీసీఎల్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం 4.8–0.8% మధ్య నష్టపోయాయి. అయితే ఎన్‌టీపీసీ, ఎయిర్‌టెల్, దివీస్, ఎంఅండ్‌ఎం, సిప్లా, అల్ట్రాటెక్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, డాక్టర్‌ రెడ్డీస్‌ 2–1% మధ్య లాభపడ్డాయి. 

ఫెడ్‌ ఎఫెక్ట్‌ 
ఇప్పటికే దేశీయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ధరల కట్టడికి రెపో రేటును ఐదు వారాల్లోనే 0.9 శాతంమేర పెంచగా.. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సైతం మరింత వేగంగా వ్యవహరించనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడిలో భాగంగా నేడు(బుధవారం) ప్రకటించనున్న పాలసీ విధానాలలో 0.75 శాతం వడ్డీ రేటును పెంచవచ్చని అత్యధిక శాతం మంది నిపుణులు భావిస్తున్నారు.

దీంతో యూఎస్‌ మార్కెట్లు పతనబాటలో సాగుతుంటే.. డాలరు ఇండెక్స్‌ బలపడుతోంది. ఈ ప్రభావం దేశీయంగా రూపాయిని దెబ్బతీస్తున్న సంగతి తెలిసిందే. దీనికితోడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అటు బాండ్లు, ఇటు ఈక్విటీల నుంచి ఇటీవల పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ అంశాలన్నీ దేశీయంగా సెంటిమెంటును బలహీనపరచినట్లు స్టాక్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొత్త కనిష్టాలకు రూపాయి నీరసించడం, మండుతున్న ముడిచమురు ధరలు,  ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తదితర అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు తెలియజేశారు. 

ఎఫ్‌పీఐలు వెనక్కి 
కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న ఎఫ్‌పీఐలు మరోసారి నికర అమ్మకందారులుగా నిలిచారు. నగదు విభాగంలో మంగళవారం రూ. 4,502 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 3,807 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 4,164 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 0.16 శాతం, 0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,874 నష్టపోగా.. 1,435 లాభాలతో ముగిశాయి. 

మరిన్ని వార్తలు