మళ్లీ లాభాల్లోకి మార్కెట్‌

5 Oct, 2021 00:30 IST|Sakshi

కార్పొరేట్ల క్యూ2 ఆదాయాలపై ఆశలు 

అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు 

నాలుగు రోజుల నష్టాల ముగింపు 

సెన్సెక్స్‌ లాభం 534 పాయింట్లు 

17,700 చేరువలో ముగిసిన నిఫ్టీ 

రూ.3.17 లక్షల కోట్ల సంపద సృష్టి 

ముంబై: నాలుగు రోజుల నష్టాల ముగింపు తర్వాత స్టాక్‌ మార్కెట్‌ మళ్లీ లాభాల పట్టాలెక్కింది. కార్పొరేట్ల రెండో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు మెప్పించవచ్చనే ఆశలతో సోమవారం స్టాక్‌ సూచీలు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. మెటల్, ఆర్థిక, ఐటీ, ఇంధన రంగాల షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ 534 పాయింట్లు పెరిగి 59,299 వద్ద నిలిచింది. నిఫ్టీ 159 పాయింట్లు ర్యాలీ చేసి 17,691 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి క్షీణతలు  సూచీల ర్యాలీని అడ్డుకోలేకపోయాయి.

ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. గతవారంలో పతనాన్ని చూసిన మెటల్‌ షేర్లకు అధిక డిమాండ్‌ లభించింది. ప్రైవేటీకరణ ఆశలతో ప్రభుత్వ కంపెనీల షేర్లు పెరిగాయి. ఫార్మాస్యూటికల్స్, స్పెషాలిటీ కెమికల్‌ కౌంటర్లకు కొనుగోళ్లతో కళకళలాడాయి. క్యూ2 ఆర్థిక ఫలితాల సీజన్‌ను ప్రారంభించనున్న ఐటీ షేర్లలో కన్సాలిడేషన్‌ చోటు చేసుకుంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు.

దీంతో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లు రెండు శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్‌ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.860 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.228 కోట్ల షేర్లను కొన్నారు. చైనా ఎవర్‌గ్రాండే గ్రూప్‌ రుణ సంక్షోభం, ద్రవ్యోల్బణ ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 19 పైసలు బలహీనపడి 74.31 వద్ద స్థిరపడింది. సూచీల భారీ ర్యాలీతో స్టాక్‌ మార్కెట్లో ఒక్క రోజులో రూ.3.17 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మార్కె ట్‌ విలువ రూ.266.77 లక్షల కోట్లకు చేరింది.  

‘‘వారం రోజుల స్థిరీకరణ తర్వాత స్టాక్‌ మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌(జూలై–సెప్టెంబర్‌)ఫలితాలను అక్టోబర్‌ 8న దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ బోణీ చేయనుంది. తొలి దశతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థపై మలి దశ కోవిడ్‌ ప్రభావం తక్కువగా ఉన్నందున క్యూ2లో కార్పొరేట్లు మెరుగైన ఆర్థిక గణాంకాలు ప్రకటించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే పండుగ సీజన్‌లో డిమాండ్‌ మరింత ఊపందుకోవచ్చనే ఆశలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు స్టాక్‌ సూచీల బౌన్స్‌ బ్యాక్‌కు కారణమయ్యాయి’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. 

ఇంట్రాడే ట్రేడింగ్‌ ఇలా... 
ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.., దేశీయ మార్కెట్‌ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 377 పాయింట్ల లాభంతో 59 వేలపై 59,143 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 17600 పైన 17,616 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వరుస నాలుగురోజు మార్కెట్‌ పతనంతో దిగివచ్చిన షేర్లను కొనుగోళ్లు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. తొలి సెషన్‌లో సెన్సెక్స్‌ 782 పాయింట్లు ఎగసి 59,548 వద్ద, నిఫ్టీ 219 పాయింట్లు ర్యాలీ చేసి  17,751 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. ఆసియా మార్కెట్ల నష్టాల ముగింపు, యూరప్‌ మార్కెట్ల బలహీన ప్రారంభంతో సూచీలు కొంతమేర లాభాల్ని కోల్పోయాయి. మిగిలిన లాభాల్ని చివరి వరకు నిలుపుకోవడంలో సూచీలు సఫలమయ్యాయి.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
కోవిడ్‌ ఔషధ తయారీ అనుమతులు లభించడంతో దివీస్‌ ల్యాబ్స్‌ షేరు ఎనిమిది శాతం లాభపడి రూ.5221 వద్ద ముగిసింది.  
ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ వార్తలతో ఎన్‌టీపీసీ షేరు ర్యాలీ కొనసాగుతోంది. ఇంట్రాడేలో 6.5% ఎగసింది. చివరికి 4% లాభంతో రూ.146 వద్ద స్థిరపడింది.  
వ్యాపార రికవరీ ఆశలతో టాటా మోటార్స్‌ షేరు 3% పెరిగి రూ.342 వద్ద నిలిచింది.  
ఇన్వెస్కో–గోయెంకా పంచాయితీ బొంబై హైకోర్టుకు చేరిన నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ 2% పెరిగి రూ.301 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు