పావెల్‌ ప్రకటనతో భారీ పతనం.. రూ.2.39 లక్షల కోట్ల సంపద ఆవిరి

30 Aug, 2022 05:26 IST|Sakshi

సెన్సెక్స్‌ 861 పాయింట్లు క్రాష్‌

నిఫ్టీకి 246 పాయింట్ల నష్టం

ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు

ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీరేట్ల పెంపు తప్పదని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రకటనతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల ప్రభావంతో రోజంతా బలహీనంగానే ట్రేడయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 861 పాయింట్లు క్షీణించి 57,973 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 246 పాయింట్ల పతనంతో 17,313 వద్ద నిలిచింది.

ఆసియాలో ఒక్క చైనా అన్ని దేశాల స్టాక్‌ సూచీలు రెండుశాతం నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు 0.50% నుంచి ఒకశాతం పతనమయ్యాయి. అమెరికా సూచీలు పావుశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఒకటిన్నర నష్టంతో బీఎస్‌ఈలో రూ.2.39 లక్షల కోట్ల సంపద మాయమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొ త్తం విలువ రూ.274 లక్షల కోట్లకు దిగివచ్చింది. 

ఆరంభ నష్టాల నుంచి రికవరీ
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఉదయం స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 1467 పాయింట్ల పతనంతో 57,367 వద్ద, నిఫ్టీ 370 పాయింట్ల పతనంతో 370 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 57,367 వద్ద కనిష్టాన్ని, 58,208 గరిష్టాన్ని చూసింది. నిఫ్టీ 17,380 – 17,166 పరిధిలో ట్రేడైంది.  రిలయన్స్‌ షేరు ఒడిదుడుకులకు లోనై,  చివరికి ఒకశాతం నష్టంతో రూ.2,597 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు