పదహారువేల పాయింట్లు దాటిన నిఫ్టీ.. లాభాల్లో ఇన్వెస్టర్లు

3 Aug, 2021 16:35 IST|Sakshi

ముంబై: ఇన్వెస్టర్లు లాభాలబాట పట్టారు. శరవేగంతో సెస్సెక్స్‌ పైపైకి చేరుకుంది. నిఫ్టీ తొలిసారిగా పదహారువేల మార్క్‌ను దాటింది. మొత్తంగా మంగళవారం మార్కెట్‌లో మంగళకర ఫలితాలు వెలువడ్డాయి.  గతవారం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు రికార్డు సృష్టించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ రెండు ప్రధాన సూచీలు జీవితకాల గరిష్ఠాలను టచ్‌ చేశాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ తొలిసారి 16 వేల మార్క్‌ను దాటింది. 

సెన్సెక్స్‌ దూకుడు
బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో ఈ రోజు సెన్సెక్స్‌ 52,125 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా లాభాలు పొందుతూ పోయింది, మార్కెట్‌ ముగిసే సమయానికి 872 పాయింట్లు లాభపడి 53,823 పాయింట్ల వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్‌ 937 పాయింట్లు లాభపడి 53,887 పాయింట్లను టచ్‌ చేసింది. యాభై నాలుగు వేల మార్క్‌ని క్రాస్‌ చేస్తుందా అన్నట్టుగా సెన్సెక్స్‌ దూకుడు కొనసాగింది.

నిఫ్టీ రికార్డు
నేషనల్‌ స్టాక్‌​ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ తొలిసారిగా పదహారు వేల మార్క్‌ని దాటింది. ఈ రోజు ఉదయం 15,951 పాయింట్లతో మార్కెట్‌ ప్రారంభమయ్యింది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో నిఫ్టీ క్రమంగా పైపైకి చేరుకుంటూ పదహారు వేల మార్క్‌ని దాటింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 245 పాయింట్లు లాభపడి 16,130 పాయింట్ల వద్ద ముగిసింది. 

లాభాల బాట
ఈ రోజు మార్కెట్‌లో మెటల్‌ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈ 30 సూచీలో టైటన్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ నష్టాలు చవిచూశాయి.

సానుకూల సంకేతాలు
కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనే సంకేతాలు ఇవ్వడం, ఆగస్టులోకి ప్రవేశించినా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉండటంతో ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోనుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీనికి తోడు మాన్యుఫ్యాక్కరింగ్‌ సెక్టార్‌ మూడు నెలల గరిష్ఠానికి చేరుకోవడం కూడా మార్కెట్‌కి ఊతం ఇచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుడులు పెట్టేందుకు పోటీ పడ్డారు. 

మరిన్ని వార్తలు