Stock Market: ఇన్వెస్టర్లు అలా చేస్తే నష్టపోవాల్సిందే.. బడా బ్రోకరైజ్ సంస్థ వార్నింగ్‌!

13 Jul, 2022 20:18 IST|Sakshi

భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ వ్యవహారాల్లో అతిపెద్ద బ్రోకరేజీ సంస్థ అయిన జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ డిమ్యాట్‌ అకౌంట్ హోల్డర్లుతో పలు ఆసక్తికర విషయాలను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.  ఆయన తరచుగా ట్రేడర్స్ టిప్స్ ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లు తమ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని కామత్‌ హెచ్చరించారు.

సాధారణంగా ఇన్వెస్టర్లు మోసపోయే సులువైన మార్గం వారి లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకోవడమేనని వెల్లడించారు. పెన్నీ స్టాక్స్ సహాయంతో మోసగాళ్లు కృత్రిమ నష్టాలను సృష్టించవచ్చని తెలిపారు. మోసగాళ్లు ధనాన్ని తరలించడానికి ఇల్లిక్విడ్ ఆప్షన్‌ లేదా పెన్నీ స్టాక్‌లను ఉపయోగించి కృత్రిమ నష్టాలను సృష్టిస్తారన్నారు. అందుకే వీటి పట్ల కాస్త అప్రమత్తత అవసరమని చెప్పారు. సాధారణంగా తమ బ్యాంక్ ఐడీ, లాగిన్‌ల వివరాలు ఇతరులతో పంచుకోకుండా ఎలా వ్యవహరిస్తారో, అదే విధంగా వారి ట్రేడింగ్ ఖాతా లాగిన్‌ల విషయంలోనూ వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు.

అఫిషియల్‌ బ్రోకర్ వెబ్‌సైట్‌లు, యాప్‌లు కాకుండా ఎక్కడా లాగిన్ వివరాలను నమోదు చేయకపోవడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఏ గుర్తింపులేని సలహాదారులు భారీ రాబడిని ఆఫర్ చేస్తాయని , అలాంటి మోసగాళ్లపై తమ టీమ్ గతంలో కొరడా ఝుళిపించిందని కామత్ వెల్లడించారు. మరికొన్ని సందర్భాల్లో కొందరు తెలియక వారి అకౌంట్‌ వివరాలను ఇతరులతో వాట్సప్‌, టెలిగ్రామ్‌లలో కూడా పంచుకుంటారని చెప్పారు. ఇలాంటి వాటిని చేయకపోవడమే మంచిదని సూచించారు. ఇన్వెస్టర్లున ట్రేడ్ చేసే ముందు వాటిని బాగా అర్థం చేసుకోవాలని కామత్‌ సూచించారు.

చదవండి: Nothing Phone Price: అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన నథింగ్‌ ఫోన్‌ (1), ధర ఎంతంటే!

మరిన్ని వార్తలు