లాక్‌డౌన్‌లో మొబైల్స్‌పై జోరుగా స్టాక్‌ ట్రేడింగ్‌

21 Sep, 2020 07:04 IST|Sakshi

జనవరి–జూలై మధ్య 47 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కాలంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు మరింత మంది ఈక్విటీ మార్కెట్లలోకి ప్రవేశించి.. మొబైల్స్‌పై ట్రేడింగ్‌కు ఆసక్తి చూపించినట్టు బ్రోకరేజీ సంస్థలు వెల్లడించాయి. రానున్న కాలంలోనూ స్మార్ట్‌ఫోన్ల ద్వారా ట్రేడింగ్‌ మరింత పుంజుకుంటుందని అవి అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే మొబైల్‌ ఫోన్ల నుంచి వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సమాచారం తెలుసుకోవడంతోపాటు, పెట్టుబడులకు సంబంధించి వెంటనే నిర్ణయాన్ని అమలు చేసేందుకు సౌలభ్యం ఉంటుందని పేర్కొన్నాయి.

‘‘వినియోగం పరంగా సౌకర్యంగా ఉండడం వల్ల లాక్‌డౌన్‌ సమయంలో డెస్క్‌టాప్‌ నుంచి మొబైల్‌ పరికరాలపైకి చెప్పుకోతగిన స్థాయిలో ట్రేడింగ్‌ కార్యకలాపాలు బదిలీ అయ్యాయి’’ అని ఫైయర్స్‌ సీఈవో తేజాస్‌ కొడాయ్‌ తెలిపారు. ప్రధానంగా మొదటిసారి ఇన్వెస్టర్లు, మిలీనియల్స్‌ నుంచి డిమాండ్‌ ఉన్నట్టు చెప్పారు. మొబైల్‌ యాప్‌పై ట్రేడింగ్‌లో చెప్పుకోతగినంత పెరుగుదల నెలకొన్నట్టు షేర్‌ఖాన్‌ సీఈవో జైదీప్‌ అరోరా తెలిపారు. 2020 జనవరి–జూలై మధ్య ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 47 శాతం పెరిగిందని.. షేర్‌ఖాన్‌ యాప్‌ నుంచి ఆర్డర్ల సంఖ్యలో 91 శాతం వృద్ధి ఉన్నట్టు ఆయన చెప్పారు. ఆధునిక టెక్నాలజీ, వినియోగానికి సౌకర్యంగా ఉండడం వల్ల మొబైల్‌ యాప్స్‌పై ట్రేడింగ్‌ విస్తృతం అవుతున్నట్టు అప్‌స్టాక్స్‌ సీఈవో రవికుమార్‌ వెల్లడించారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు