మూడో రోజూ ముందుకే 

13 Sep, 2022 04:16 IST|Sakshi

60 వేల స్థాయిపై సెన్సెక్స్‌

17,900 పాయింట్ల పైకి నిఫ్టీ

కలిసొచ్చిన క్రూడ్‌ ధరల పతనం

సానుకూల అంతర్జాతీయ సంకేతాలు

ముంబై: జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మూడోరోజూ కదంతొక్కింది. బ్యాంకింగ్, ఐటీ, ఇంధన షేర్లలో కొనుగోళ్లతో సోమవారం సెన్సెక్స్‌ 322 పాయింట్లు పెరిగి మూడు వారాల గరిష్ట స్థాయి 60,115 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 103 పాయింట్లు బలపడి 17,900 పైన 17,936 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో అన్ని రంగాల షేర్లకు డిమాండ్‌ లభించింది.

ముఖ్యంగా అధిక వెయిటేజీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 1–2% రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచాయి. నిఫ్టీ ఆర్జించిన మొత్తం లాభాల్లో ఈ షేర్లవే 46 పాయింట్లు కావడం విశేషం. బీఎస్‌ఈ మిడ్‌ అరశాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఒకశాతం చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,050 కోట్ల షేర్లను కొన్నారు.

దేశీయ ఇన్వెస్టర్లు రూ.891 కోట్ల షేర్లను అమ్మేశారు. ఆసియా, యూరప్‌ మార్కెట్లు ఒకశాతం లాభపడ్డాయి. క్రూడాయిల్‌ రికవరీ తర్వాత యూఎస్‌ ఫ్యూచర్లు లాభాల్లోకి మళ్లాయి.  ఫారెక్స్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.53 వద్ద ముగిసింది. కాగా గడిచిన 3 రోజుల్లో సెన్సెక్స్‌ 1,086 పాయింట్లు, నిఫ్టీ 312 పాయింట్లు బలపడ్డాయి. 

వృద్ధి బాట
వృద్ధి పథంలో పయనిస్తున్న ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తూ దేశీయ మార్కెట్‌ లాభాలను గడిస్తోంది. అంతర్జాతీయంగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 93 డాలర్లకు దిగి వచ్చింది. గత నెలలో వాహన విక్రయాలు, జీఎస్టీ వసూళ్లు, బ్యాంకుల రుణ వృద్ధి వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఆహార ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అంచనాలను మించవచ్చు. స్వల్పకాలానికి సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. నిఫ్టీకి 18,000 స్థాయి వద్ద కీలక నిరోధం ఎదురుకావొచ్చు.     – వినోద్‌ నాయర్, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభాలే 
ఉదయం సెన్సెక్స్‌ 119 పాయింట్లు బలపడి 59,912 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 17,890 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మద్దతివ్వడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 492 పాయింట్లు బలపడి 60,285 వద్ద, నిఫ్టీ 148 పాయింట్లు దూసుకెళ్లి 17,981 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
►శుభలక్ష్మీ పాలియెస్టర్స్‌ను రూ.1,522 కోట్లకు సొంతం చేసుకోవడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఒకశాతం లాభపడి రూ.2,598 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో రెండుశాతం పెరిగి రూ.2612 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.   

►ఆరంభ లాభాల్ని కోల్పోయి మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ షేరు స్వల్పంగా 0.35% పెరిగి రూ.540 వద్ద ముగిసింది. హౌసింగ్‌ ప్రాజెక్టులను నిర్మించేందుకు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముంబై, పుణే, బెంగళూరు నగరాల్లో భూములను కొనుగోలు చేస్తామనే ప్రకటనతో ఇంట్రాడేలో ఈ షేరు 2.37 శాతం ర్యాలీ చేసి రూ.550.40 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. 

మరిన్ని వార్తలు