కన్సాలిడేషన్‌ కొనసాగుతుంది..!

7 Sep, 2020 04:21 IST|Sakshi

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు 

కరోనా సంబంధిత వార్తలు 

ఈ వారం మార్కెట్‌కు కీలకం

భారత–చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించిన వార్తలతో పాటు కరోనా వైరస్‌ సంబంధిత వార్తలు కూడా ఈ వారం మార్కెట్‌ గమనానికి కీలకం కానున్నాయని నిపుణులంటున్నారు. ప్రపంచ మార్కెట్ల పరిణామాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు.   డాలర్‌తో రూపాయి మారకం విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం... తదితర అంశాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని విశ్లేషకులంటున్నారు. మరోవైపు మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ విషయమై తదుపరి విచారణ ఈ నెల 10న జరగనున్నది. దీనికి సంబంధించిన పరిణామాలను బట్టి బ్యాంక్‌ షేర్ల కదలికలుంటాయి.  

ఫలితాల సీజన్‌ ముగింపు...!
గత వారం విడుదలైన వివిధ గణాంకాలు ఆర్థిక రికవరీకి చాలా కాలమే పడుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ శుక్రవారం మార్కెట్‌  ముగిసిన తర్వాత పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనున్నాయి.  ఇక ఈ వారంతో జూన్‌ క్వార్టర్‌ ఫలితాల సీజన్‌ ముగియనున్నది. ఈ వారంలో మొత్తం 341 కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ వారంలో భెల్, ఐఆర్‌సీటీసీ, ఫ్యూచర్‌ కన్సూమర్, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ తదితర కంపెనీలు ఫలితాలను వెల్లడిస్తాయి.  

కన్సాలిడేషన్‌ కొనసాగుతుంది...!
మార్కెట్‌ కన్సాలిడేటెడ్‌ మూడ్‌లో ఉందని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనలిస్ట్‌ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. లాభాల స్వీకరణ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని వివరించారు. ఆగస్టులో  నికర కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గత వారంలో మాత్రం రూ.3,800 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారని గణాంకాలు వెల్లడించాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు