వైరల్‌: వర్క్‌ప్లేసులో ఫోన్‌ ఛార్జింగ్‌పై రచ్చ.. చర్చ

27 Nov, 2021 11:11 IST|Sakshi

స్మార్ట్‌ ఫోన్‌.. మనకి రోజూవారీ పనుల్లో ఓ భాగం అయ్యింది. బయటకు వెళ్లేప్పుడు మాస్క్‌ మరిచిపోతున్నా.. ఫోన్‌ మాత్రం వెంటే ఉంటుంది. మరి వాడకానికి తగ్గట్లు పాపం ఛార్జింగ్‌ కూడా అవసరం కదా! అందుకే చాలామంది పని చేసే చోట్ల కూడా ఫోన్లకు ఛార్జింగ్‌ పెట్టేస్తుంటారు. అయితే ఇక్కడో బాస్‌ అందుకు అభ్యంతరం చెప్తున్నాడు.  


వర్క్‌ప్లేస్‌లో ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టడం కుదరదని అంటున్నాడు ఆ బాస్‌. ఆ బాస్‌, ఆఫీస్‌ ఎక్కడిదనేది క్లారిటీ లేదు. కానీ, ఇందుకు సంబంధించిన ఓ పేపర్‌ నోట్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈ అలవాటు కరెంట్‌ దొంగతనం కిందకే వస్తుందని, పనిచోట నైతిక విలువలకు సంబంధించిన విషయమని పేర్కొన్నాడు ఆ బాస్‌. ఈ నోట్‌​ రెడ్డిట్‌ వెబ్‌సైట్‌లో చర్చకు దారితీసింది. గంటల తరబడి ఆఫీసుల్లో ఉన్నప్పుడు ఫోన్‌ ఛార్జింగ్‌ తగ్గిపోతుందని, అలాంటప్పుడు ఆఫీస్‌ కరెంట్‌ ఉపయోగించుకోవడంలో తప్పేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తు‍న్నారు కొందరు. 

మరికొందరేమో ఆ బాస్‌ చేసింది కరెక్టేనని, దీనివల్ల ఫోన్‌-ఇంటర్నెట్‌ వాడకం తగ్గుతుందని, అంతేకాదు మైండ్‌ డైవర్షన్‌ లేకుండా పనిలో నైపుణ్యం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే వర్క్‌ ప్లేస్‌లో ఫోన్‌, డివైస్‌ల ఛార్జింగ్‌ను చాలా కంపెనీలు వ్యతిరేకిస్తాయని, వాల్‌మార్ట్‌ లాంటి ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ సైతం ఇలాంటి నిబంధనను అమలు చేస్తోందని గుర్తు చేస్తున్నారు ఇంకొందరు. ఇక ఈ నోట్‌ మూడేళ్ల క్రితమే రెడ్డిట్‌లో ఇలా చర్చకు దారితీయడం మరో విశేషం.

చదవండి: Work From Home.. మారిన రూల్స్‌! ఏంటంటే..

మరిన్ని వార్తలు