ఆఫర్‌ టికెట్ల అమ్మకాలు ఆపండి

4 Aug, 2020 05:21 IST|Sakshi

స్పైస్‌జెట్‌ను కోరిన డీజీసీఏ

న్యూఢిల్లీ: ప్రభుత్వం విధించిన చార్జీల పరిమితులు అమల్లో ఉన్నందున సోమవారం నుంచి ప్రారంభించిన ఐదు రోజుల రాయితీ టికెట్ల అమ్మకాలను నిలిపివేయాలని ఏవియేషన్‌ రెగ్యులేటర్‌  (డీజీసీఏ) చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను కోరింది. రెండు నెలల క్రితం దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైనప్పటి నుండి చార్జీల పరిమితులు అమలులో ఉన్నాయని డీజీసీఏ సీనియర్‌ అధికారులు తెలిపారు.

చౌకధరల విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌  ఐదు రోజుల ‘1+1 ఆఫర్‌ సేల్‌‘ ను ప్రారంభించినట్లు  సోమవారం ఉదయం ప్రకటించడంతో డీజీసీఏ వెంటనే స్పందించింది. దేశీ ప్రయాణాలకు  పన్నులను మినహాయించి రూ .899 నుండి వన్‌–వే బేస్‌ చార్జీలను అందిస్తున్నట్లు  స్పైస్‌జెట్‌ ప్రకటించింది.అమ్మకం సమయంలో టికెట్‌ బుక్‌ చేసుకునే కస్టమర్లకు గరిష్టంగా రూ .2,000 విలువ కలిగిన కాంప్లిమెంటరీ వోచర్‌ లభిస్తుందని, భవిష్యత్తులో బుకింగ్‌ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.

కరోనావైరస్‌ వ్యాప్తితో దాదాపు రెండు నెలల సస్పెన్షన్‌ తర్వాత దేశీయ ప్రయాణికుల సేవలు మే 25 న తిరిగి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 24 వరకు విమాన చార్జీల పరిమితి ఉంటుందని మే 21 న పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ప్రకటించిన తరువాత, మరిన్ని వివరాలతో డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. పతి విమానయాన సంస్థ తన టిక్కెట్లలో కనీసం 40 శాతం  కనిష్ట గరిష్ట ధరల మద్య స్థాయి కన్నా తక్కువకు విక్రయించాలని  రెగ్యులేటర్‌ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు