అలెగ్జాండర్‌ గుర్రం కనిపెట్టిన పదార్థం.. వందల కోట్ల వ్యాపారానికి నాంది

26 Nov, 2021 09:32 IST|Sakshi

అలెగ్జాండర్‌ గుర్రం కనిపెట్టిన ఈ పదార్థం ఇప్పుడు ఎమర్జింగ్‌ బిజినెస్‌గా మారింది. పాకిస్థాన్‌ మీదుగా ఇండియాకు వచ్చి ఇక్కడి నుంచి ప్రపంచమంతటికీ విస్తరిస్తోంది. ఆరోగ్యన్ని అందివ్వడంతో పాటు ఆకర్షణీయమైన వస్తువులకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇంతకీ ఆ పదార్థం ఏంటంటే రాక్‌ సాల్ట్‌. ప్రపంచంలో చాలా అరుదుగా దొరికే ఈ ఉప్పు ఒకప్పుడు అఖండ భారత్‌లో భాగంగా ఉండేది... ఇప్పుడు సైతం భారత్‌ నుంచే విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. 

అలెగ్జాండర్‌ దండయాత్ర
వరుస దండయాత్రలతో ఎందరో రాజులనీ ఓడించి ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న అలెగ్జాండ్‌ ది గ్రేట్‌. దేశం నుంచి అలెగ్జాండ్‌ భారత్‌ దేశానికి ఆయన దండెత్తి వచ్చాడు. అప్పటికే ఎందరో రాజులు అలెగ్జాండర్‌కి వెంటనే తలొగ్గినా భారతరాజు పురుషోత్తమ్‌ ఓటమిని అంగీకరించక యుద్ధానికి సై అన్నాడు. దీంతో అప్పడి అఖండ భారత్‌లో భాగమై ప్రస్తుతం పాకిస్తాన్‌లో అంతర్భాగంగా ఉన్న కేవ్‌రా కొండల్లో అలెగ్జాండర్‌ సైనిక శిబిరం బస చేసింది. స్వయంగా యుద్ధంలో పాల్గొన్న అలెగ్జాండర్‌ సైతం అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో అలెగ్జాండర్‌కి ఎంతో ప్రీతిపాత్రమైన ఆయన గుర్రం అదే పనిగా అక్కడున్న బండరాళ్లను నాకడం అక్కడున్న అందరినీ ఆకర్షించింది. రాజుగారి గుర్రానికి ఏమైందా అని అంతా ఆరా తీశారు. చివరకు ఆ బండరాళ్లు ఉప్పును పోలిన రుచి ఉన్నట్టు గమనించారు. యుద్ధం ముగించి తిరుగు ప్రయాణంలో తమతో పాటు ఆ ఉప్పు రాళ్లను తీసుకెళ్లి మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు.

బ్రిటీషర్ల రాకతో
క్రీస్తు పూర్వం అలెగ్జాండర్‌ దండయాత్రల తర్వాత మళ్లీ రాక్‌సాల్ట్‌ వ్యాపారం మరుగున పడిపోయింది. అయితే 16వ శతాబ్ధంలో ఇండియాలోకి అడుగు పెట్టిన ఆంగ్లేయుల కన్ను ఈ రాక్‌సాల్ట్‌పై పడింది. దీంతో 1870లో బ్రిటీషర్ల ‍ద్వారా రాక్‌సాల్ట్‌ మరోసారి ప్రపంచ ఉనికిలోకి వచ్చింది. అయితే దేశ విభజన తర్వాత ఉప్పు రాళ్లను కలిగిన కేవ్‌రా కొండలు పాకిస్థాన్‌ వశమయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్‌
సముద్ర ఉప్పుని ఎక్కువగా వినియోగించడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెరగడానికి తోడు ఆయుర్వేద శాస్త్రంలో రాక్‌సాల్ట్‌ ప్రత్యేకతలు విపులంగా ఉండటం వల్ల వ్యాపారులు మరోసారి రాక్‌సాల్ట్‌పై ఫోకస్‌ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హిమాలయన్‌ బ్రాండ్‌ పేరుతో రాక్‌సాల్ట్‌ని అమెజాన్‌ వేదికగా 2009లో ఇంగ్లాండ్‌లో అమ్మకానికి ఉంచారు. రుచితో పాటు ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉండటం.. మార్కెటింగ్‌ టెక్నిక్‌ తోడవడంతో ఇప్పుడీ ఉప్పుకి ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. ఇంగ్లాండ్‌ నుంచి క్రమంగా యూరప్‌, అమెరికా, ఏషియా దేశాలకు విస్తరించింది. మన దగ్గర  900 గ్రాముల ఉప్పు ప్యాకెట్‌ ధర రూ. 300లుగా ఉంది. అదే సాధారణ ఉప్పు ఎంత మంచి క్వాలిటీది అయినా కేజీ రూ.30 లోపే ఉంటుంది. 

పాకిస్తాన్‌ టూ ఇండియా
కేవ్‌రా పర్వతాలు పాకిస్తాన్‌లో ఉన్నా అక్కడ మైనింగ్ చేయడం తప్పితే దాన్ని ప్రాసెస్‌ చేసి అందమైన డిజైన్లుగా, రాక్‌సాల్ట్‌గా మార్చే పరిశ్రమలు లేవు. దీంతో కేవ్‌రా పర్వతాల్లో ఉప్పుని భూగర్భం నుంచి పెద్ద పెద్ద బండరాళ్లుగా బయటకు తీసి సైజులుగా కట్‌ చేసి ఇండియాకి ఎగుమతి చేస్తుంటారు. టన్ను రాక్‌ సాల్ట్‌కి 40 డాలర్ల వంతున పాకిస్తాన్‌ నుంచి ఇండియాకి ఈ ఉప్పు చేరుతుంది. ఇక్కడ ప్రాసెస్‌ చేసి టన్నుకి 300 డాలర్ల వంతున విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పుల్వామా దాడి.. సర్జికల్‌ ‍స్ట్రైక్స్‌ ద్వారా ఈ ఉప్పుని ఇండియాకి ఎగుమతి చేయోద్దంటూ ప్రచారాలు జరిగాయి.

ఆరోగ్యం, ఆకర్షణ
సాధారణ ఉప్పుతో పోల్చితే రాక్‌సాల్ట్‌తో లవణాలు అధికం. రాక్‌సాల్ట్‌లో 98 శాతం సోడియం క్లోరైడ్‌ ఉండగా మెగ్నీషియం, పోటాషియం, కాల్షియం వంటి మినరల్స్‌ ఉన్నాయి. దీంతో రాక్‌సాల్ట్‌ మిగిలిన ఉప్పు లాగా తెల్లగా కాకుండా గులాబీ రంగులో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీంతో ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌లతో పాటు సాల్ట్‌ లాంప్స్‌, బాత్‌ సాల్ట్‌, ల్యాంప్స్‌, గౌర్‌మెట్‌ సాల్ట్‌లతో పాటు అనేక ఆకర్షణీయమైన వస్తువులుగా దీన్ని మార్చి మార్కెట్‌లో అమ్మకాలు సాగిస్తున్నారు.  ఉత్తర అమెరికా, లాటిన్‌ అమెరికా,  యూరప్‌, ఏషియా పసిఫిక్‌, మిడిల్‌ ఈస్ట్‌ ఆఫ్రికా దేశాల్లో ఈ రాక్‌సాల్ట్‌కి ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం రాక్‌సాల్ట్‌ వ్యాపారం వంద కోట్ల రూపాయలకు చేరుకుంది. వేలటన్నులు 4 లక్షల టన్నుల రాక్‌ సాల్ట్‌ ఉత్పత్తి చేస్తున్నారు.  

కోట్ల ఏళ్ల క్రితం
ఒకప్పుడు భూగోళం అంతా సముద్రం ఆవరించి ఉండేది. కోట్ల ఏళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా సముద్ర మట్టం తగ్గిపోతూ భూమి పైకి వచ్చింది. అయితే ఈ క్రమంలో కేవ్‌రా కొండల్లోని సముద్రపు నీరు ఉప్పుగా మారిపోయి భూగర్భం అడుగునే రాయి రూపంలో ఉండిపోయింది. సుమారు 600 మిలియన్‌ ఏళ్ల కిందట ఈ ఉప్పు రాతి కొండలు ఏర్పడినట్టు ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే వేల ఏళ్ల క్రితమే ఈ ఉప్పు గొప్పతనం గురించి ఆయుర్వేద గ్రంథాల్లో మన మహర్షులు పేర్కొన్నారు. 

సాక్షి, వెబ్‌ ప్రత్యేకం

మరిన్ని వార్తలు