ఎంఎస్‌ ధోని, కడక్‌నాథ్‌ కోళ్లు , కశ్మీర్‌ యూత్‌.. ఓ స్ఫూర్తిదాయక కథ

15 Jan, 2022 10:45 IST|Sakshi

మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ అడవుల్లో పెరిగే కడక్‌నాథ్‌ కోళ్లు ఇప్పుడు కశ్మీర్‌లో సందడి చేస్తున్నాయి.  అక్కడి యువతకి సరికొత్త ఉపాధిని చూపిస్తున్నాయి. ఇండియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కారణంగా ఈ కోళ్లు ఝార్ఖండ్‌ మీదుగా  కశ్మీర్‌ చేరుకున్నాయి.  తీవ్రవాద ప్రాబల్యంతో అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్న కశ్మీర్‌ యువతలో కొందరికి ధోని ‍ఆదర్శంగా నిలిచాడు. తీవ్రవాదం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువత స్టార్టప్‌ల వైపు అడుగులు వేసేందుకు పరోక్షంగా సాయం అందించాడు. 

మైదానం బయట కూడా
టార్జన్‌ వికెట్‌ కీపర్‌, డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌ కూల్‌గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు మహేంద్రసింగ్‌ ధోని. ఎంతోమంది క్రికెటర్లకు ఇన్సిపిరేషన్‌గా నిలిచారు. దీంతో ధోనిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు కంపెనీలు పోటీ పడ్డాయి. ఎండార్స్‌మెంట్లలో సచిన్‌కి ధీటుగా ఎదిగాడు. ధోని ఏదైనా చెబితే చాలు ఆచరించేందుకు బోలెడు మంది సిద్ధంగా ఉండేవాళ్లు, అయితే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి  ధోని రిటైర్‌ అయ్యాక  మైదానంలో అతని మెరుపు ఇన్సింగ్సులు చాలా వరకు తగ్గినా.. భారత యువతలో అతను నింపుతున్న స్ఫూర్తి అలాగే కొనసాగుతోంది.

పౌల్ట్రీ వ్యాపారంలో ధోని
క్రికెట్‌ కెరీర్‌ లాస్ట్‌ ఫేజ్‌లోకి ఎంటర్‌ కావడానికి ముందే ధోని రాంచీలో యాభై ఎకరాలతో ఫార్మ్‌ హౌజ్‌ నిర్మించాడు. ఇందులో పదెకరాల స్థలంలో ఆర్గనిక్‌ పద్దతిలో వ్యవసాయం చేస్తూ.. ఆ ఉత్పత్తులను దుబాయ్‌కి ఎగుమతి చేస్తున్నాడు. ఈ సాగుకంటే ముందు ఈ రంగంలో రాణించవచ్చనే నమ్మకం ధోనికి కల్పించినవి కడక్‌నాథ్‌ కోళ్లు. మధ్యప్రదేశ్‌ , చత్తీస్‌ఘడ్‌ ప్రాంతంలో పెరిగే కఢక్‌నాథ్‌ కోళ్లతో గతేడాది ధోని పౌల్ట్రీ రంగంలోకి అడుగు పెట్టారు. రెండు వేల కోళ్లతో ఏర్పాటు చేసిన ఈ పౌల్ట్రీ ఫార్మ్‌ దేశవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. 

కడక్‌నాథ్‌ స్టార్టప్‌
ధోని నుంచి స్ఫూర్తి పొందిన ఇద్దరు కశ్మీర్‌ యువకులు తొలిసారిగా సుందర లోయల్లో కడక్‌నాథ్‌ కోళ్ల ఫారమ్‌ ప్రారంభించారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన నుమైర్‌ రషీద్‌, మమూన్‌ఖాన్‌ అనే ఇద్దరు యువకులు ది రాయల్‌ ఫెదర్స్‌ పేరుతో స్టార్టప్‌గా కడక్‌నాథ్‌ కోళ్ల ఫారాన్ని శ్రీనగర్‌ సమీపంలో ఏర్పాటు చేశారు. కశ్మీర్‌ యువకులు ప్రారంభించిన  ఈ రాయల్‌ ఫెదర్‌ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్‌ మీడియాలో కశ్మీర్‌ యువకుల కడక్‌నాథ్‌ కోళ్ల ఫార్మ్‌ బాగా ఫేమస్‌ అయ్యింది. దీంతో వీళ్లకి ప్రోత్సాహం అందించేందుకు దేశం నలుమూలల నుంచి అనేక మంది ముందుకు వస్తున్నారు. 

కశ్మీర్‌లో మార్పు
ఇంజనీరింగ్‌ చేసిన ఇద్దరు యువకులు కోళ్ల ఫార్మ్‌ ఏర్పాటు చేయడం మిగిలిన దేశానికి పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ కశ్మీర్‌కి సంబంధించినంత వరకు ఇది కీలకమైన విషయం. ఎందుకంటే 80వ దశకం చివర్లో కశ్మీర్‌లో చెలరేగిన హింసతో పచ్చని లోయలో నెత్తురు ఏరులై పారుతోంది. అక్కడి యువత తీవ్రవాదం వైపు వెళ్లకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా ఆశించిన మేరకు సక్సెక్‌ కాలేకపోయింది. ఇటీవల కాలంలో ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. ఇండియన్‌ ఐకాన్స్‌ని స్ఫూర్తిగా తీసుకుని పైకి ఎదిగేందుకు కశ్మీర్‌ యువత ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఎంతో సానుకూలమైన అంశం. కశ్మీర్‌ యువతలో స్ఫూర్తి నింపుతున్న వారిలో  ధోని లాంటి లెజెండ్స్‌ ముందు వరుసలో ఉంటున్నారు. అందుకే ఏఎన్‌ఐ మొదలు అనేక జాతీయ మీడియా సంస్థలు వీరిపై ప్రత్యేక కథనాలు వండివారుస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వీళ్ల గురించి వెతుకులాట మొదలైంది. ఇదే బాటలో కశ్మీర​ యువత ఉపాధి మీద దృష్టి సారించి పైకి ఎదగాలని దేశం కోరుకుంటోంది. 

చదవండి: ఊపిరితిత్తుల సమస్య.. నోట్లో పైపు, చిన్నారి జోషి కోసం ‘అవతార్‌’ సాయం

మరిన్ని వార్తలు