అంతర్జాతీయ షాక్‌లను తట్టుకోగలం

14 Oct, 2021 06:35 IST|Sakshi

విదేశీ మారక నిల్వలపై దువ్వూరి సుబ్బారావు

ముంబై: భారత్‌కు ఉన్న బలమైన విదేశీ మారక నిల్వలు అంతర్జాతీయ షాక్‌ల నుంచి రక్షణగా నిలవలేవు కానీ.. వాటిని ఎదుర్కోవడానికి సాయపడతాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. బుధవారం క్రిసిల్‌ రేటింగ్స్‌ నిర్వహించిన వెబినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత్‌కు బలమైన విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, అవి అంతర్జాతీయ కుదుపులకు రక్షణ అన్న ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నట్టు చెప్పారు.

‘‘అంతర్జాతీయ షాక్‌ల (సంక్షోభాలు) నుంచి మనకేమీ రక్షణ లేదు. అంతర్జాతీయ షాక్‌ల ప్రభావం ఇక్కడ కనిపిస్తూనే ఉంది. కాకపోతే మనకున్న విదేశీ మారక నిల్వలతో వాటిని ఏదుర్కొని నిలబడొచ్చు. ఆ ఒత్తిళ్లను అధిగమించడానికి అవి సాయపడతాయంతే’’అని సుబ్బారావు పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మానిటరీ పాలసీ సాధారణ స్థితికి చేరితే.. పెద్ద ఎత్తున విదేశీ నిధులు తిరిగి వెళ్లిపోతాయని చెప్పారు. అప్పుడు మారక రేటు అస్థిరతలను నియంత్రించేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకోవచ్చన్నారు.

నాస్‌డాక్‌లో హెల్త్‌కేర్‌ ట్రయాంగిల్‌ లిస్టింగ్‌
ముంబై: క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థ సెక్యూర్‌క్లౌడ్‌ టెక్నాలజీస్‌ తాజాగా తమ అనుబంధ సంస్థ హెల్త్‌కేర్‌ ట్రయాంగిల్‌ను అమెరికన్‌ స్టాక్‌ ఎక్సే్చంజీ నాస్‌డాక్‌లో లిస్ట్‌ చేసింది. టెక్నాలజీ సంస్థలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్‌ ఎక్సే్చంజీలో లిస్ట్‌ కావడం వల్ల తమ సంస్థ ప్రాచుర్యం, విశ్వసనీయత మరింత పెరగగలవని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ త్యాగరాజన్‌ తెలిపారు. పబ్లిక్‌ ఇషఅయూ ద్వారా హెల్త్‌కేర్‌ ట్రయాంగిల్‌ 15 మిలియన్‌ డాలర్లు సమీకరించినట్లు సెక్యూర్‌క్లౌడ్, హెల్త్‌కేర్‌ ట్రయాంగిల్‌ చైర్మన్‌ సురేష్‌ వెంకటాచారి తెలిపారు.

ఇతర సంస్థల కొనుగోళ్లు, వర్కింగ్‌ క్యాపిటల్, ఇతరత్రా పెట్టుబడుల అవసరాలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెన్నైలో రిజిస్టరై, సిలికాన్‌ వేలీ కేంద్రంగా పనిచేస్తున్న సెక్యూర్‌క్లౌడ్‌ దేశీయంగా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో చాలా కాలం క్రితమే లిస్టయ్యింది. లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్‌ విభాగాలకు సేవలు అందించేందుకు 2019లో కాలిఫోరి్నయా ప్రధాన కార్యాలయంగా హెల్త్‌కేర్‌ ట్రయాంగిల్‌ను ప్రారంభించింది. బీఎస్‌ఈలో బుధవారం సెక్యూర్‌క్లౌడ్‌ షేరు 1.3 శాతం క్షీణించి రూ. 216 వద్ద క్లోజయ్యింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు