యాపిల్‌కు కలిసొచ్చిన భారత్‌

29 Jul, 2021 02:10 IST|Sakshi

జూన్‌లో రికార్డు స్థాయి ఆదాయం

కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ వెల్లడి

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు భారత్‌తోపాటు లాటిన్‌ అమెరికా మార్కెట్లు కలిసొచ్చాయి. దీంతో జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రెండంకెల వృద్ధితో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో టర్నోవర్‌ 36 శాతం అధికమై రూ.6,05,616 కోట్లు సాధించినట్టు సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ వెల్లడించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4.43 లక్షల కోట్లుగా ఉంది. నికరలాభం రూ.83,328 కోట్ల నుంచి రూ.1,61,448 కోట్లకు చేరింది. ఏ దేశం నుంచి ఎంత మొత్తం ఆదాయం సమకూరింది వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

‘ఉత్పత్తులు, సేవల విభాగాల్లో అన్ని ప్రాంతాల్లో రెండంకెల ఆదాయ వృద్ధి దక్కించుకున్నాం. ప్రత్యేకంగా భారత్, లాటిన్‌ అమెరికా, వియత్నాంతోసహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. ఈ మార్కెట్లలో నమ్మశక్యం కాని త్రైమాసికంగా జూన్‌ నిలిచిపోతుంది’ అని సీఈవో పేర్కొన్నారు. మొత్తం ఆదాయంలో ఐఫోన్‌ వాటాయే సింహభాగం ౖMðవసం చేసుకుంది. ఐఫోన్‌ అమ్మకాల ద్వారా కంపెనీకి రూ. 2,93,880 కోట్లు సమకూరింది. వాటా పరంగా మ్యాక్, ఐప్యాడ్, వేరబుల్స్, ఇతర ఉత్పుత్తులు, సేవలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు