Real Estate: హైదరాబాద్‌ శివారు జోరు!

19 Jun, 2021 00:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శివారు ప్రాంతాలలో రియల్టీ జోరు కొనసాగుతుంది. పరిధిలోనే కాదు.. కొత్త గృహాల ప్రారంభాల్లోనూ శివారు ప్రాంతాలు ప్రధాన నగరాన్ని దాటేశాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 30,340 గృహాలు లాంచింగ్‌ కాగా.. ఇందులో 45 శాతం ఔటర్‌ ప్రాంతాల్లోనే ప్రారంభమయ్యాయి. మేడ్చల్, మియాపూర్, నిజాంపేట, శంషాబాద్, కోకాపేట, పటాన్‌చెరు, తెల్లాపూర్‌ శివార్లలోనే కేంద్రీకృతమయ్యాయి. ఎఫ్‌వై 19లోని మొత్తం 18,460 యూనిట్లలో 35 శాతం శివారుల్లోనే లాంచింగ్‌ అయ్యాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ తెలిపింది.

పుణే ఫస్ట్, కోల్‌కతా లాస్ట్‌..
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2021) 1.49 లక్షల గృహాలు లాంచింగ్‌ కాగా.. ఇందులో 58 శాతం శివారు ప్రాంతాలలోనే ప్రారంభమయ్యాయి. ఎఫ్‌వై 20లో 2.07 లక్షల యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో 53 శాతం, అలాగే ఎఫ్‌వై 19లో 2.29 లక్షల ఇళ్లు ప్రారంభం కాగా.. ఇందులో 51 శాతం గృహాలు శివారు ప్రాంతాల్లోనే లాంచింగ్‌ అయ్యాయి. శివారు ప్రాంతాలలో ప్రాజెక్ట్స్‌ల లాంచింగ్స్‌లో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. కోల్‌కతా చివరి స్థానంలో నిలిచింది. ఎఫ్‌వై 21లో పుణేలో 29,950 గృహాలు ప్రారంభం కాగా.. ఇందులో 76 శాతం ముల్శీ, పిరంగట్, దౌండ్, కంషేట్, రావేట్, చకాన్, చికాళీ, వాడ్గావ్‌ బుద్రక్, తలేగావ్‌ దభాడే, ఉంద్రీ శివారుల్లోనే ఉన్నాయి. ఎఫ్‌వై 19లోని 39,210 హౌసింగ్‌లో ఔటర్‌ వాటా 67 శాతం. కోల్‌కతాలో 4,250 గృహాలు లాంచింగ్‌ కాగా.. కేవలం 26 శాతం యూనిట్లు బరాసత్, బరాక్‌పూర్, సెరాంపూర్, గారియా, హౌరాల్లోనే ప్రారంభమయ్యాయి.  

ఇతర నగరాల్లో..
► ఎఫ్‌వై 21లో ముంబైలో 34,620 యూనిట్లు లాంచింగ్‌ కాగా.. 67 శాతం గృహాలు పన్వేల్, పాల్ఘర్, వాసాయి, విరార్, బద్లాపూర్, భీవండి, డొంబివ్లీ ప్రాంతాలలోనే ప్రారంభమయ్యాయి. ఎఫ్‌వై 19లో వీటి వాటా 60 శాతంగా ఉంది.

► ఎన్‌సీఆర్‌లోని 19,090 గృహాలలో 57 శాతం సోహ్నా, గ్రేటర్‌ నోయిడా వెస్ట్, యమునా ఎక్స్‌ప్రెస్‌ వేలో ఉన్నాయి. ఎఫ్‌వై 19లోని మొత్తం 29,500 యూనిట్లలో ఔటర్‌ వాటా 49 శాతం.

► చెన్నైలోని 10,110 యూనిట్లలో 54 శాతం పూనమల్లె, అవడి, వండలూర్, షోలినాగ్నలూర్, గుడువాంచెరి, చెంగల్‌పట్టు ప్రాంతాలలో జరిగాయి. ఎఫ్‌వై 19లోని 16,130 యూనిట్లలో 44 శాతం వాటా శివారుదే.

► బెంగళూరులోని 20,520 గృహాలలో 46 శాతం చందపుర–అనెకల్‌ రోడ్, సర్జాపుర, యలహనక, దేవనహళ్లి, సర్జాపూర్‌–అట్టిబెల్‌ రోడ్‌లో ప్రారంభమయ్యాయి. ఎఫ్‌వై 19లోని 36,620 గృహాలలో శివారుల వాటా 37 శాతంగా ఉంది.

డిమాండ్‌ ఎందుకంటే?
కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారిపోయాయి. గతంలో వాక్‌–టు–వర్క్‌ కల్చర్‌ ప్రాజెక్ట్‌లకు పరుగులు పెట్టిన కస్టమర్లు ప్రస్తుతం విశాలమైన, గ్రీనరీ ఎక్కువగా ఉండే నివాసాలు, వాయు, శబ్ధ కాలుష్యం తక్కు వగా ఉండే ప్రాంతాలలో అఫర్డబుల్‌ గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోమ్, ఈ–స్కూల్, ఆరోగ్య భద్రత వంటి వసతులున్న ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరి తెలిపారు. శివారు ప్రాంతాలలో ల్యాండ్‌బ్యాంక్‌ ఉన్న డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అని సూచించారు. అంతేకాకండా శివారు, కొత్త ప్రాంతాలలో నివాస సముదాయాల నిర్మాణాలతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. మెట్రో రైలు, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వంటి మౌలిక వసతులతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది.

మరిన్ని వార్తలు