ఇథనాల్‌ ఉత్పత్తికి ప్రభుత్వ మద్దతు కావాలి

20 Oct, 2022 05:27 IST|Sakshi

ఐఎస్‌ఎంఏ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచాలంటే చక్కెర పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు అవసరమని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) ప్రెసిడెంట్‌ ఆదిత్య ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. అప్పుడే 2025 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్‌ పరిమాణాన్ని 20 శాతానికి (ఈ20) పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యపడగలదని పేర్కొన్నారు.

ఈ20 లక్ష్య సాధన కోసం 1,000 కోట్ల లీటర్ల ఇథనాల్‌ అవసరమవుతుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసిందని భారతీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా చెరకు, చక్కెర ఉత్పత్తిని పెంచేందుకు మరింత అధిక తయారీ సామర్థ్యాలు, మరిన్ని డిస్టిలరీలు అవసరమవుతాయని ఆదిత్య చెప్పారు. ఇందుకు ప్రభుత్వ విధానాలపరమైన తోడ్పాటు కావాల్సి ఉంటుందన్నారు.

పరిశ్రమ ఇప్పటికే పూర్తి ఉత్పత్తి సామర్థ్యాలతో పనిచేస్తోందని, కొత్తగా మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంటుందని ఆదిత్య వివరించారు. చక్కెర పరిశ్రమ ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతోందని, దీనికి ప్రభుత్వం నుంచి కూడా కొంత మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, చెరకు పంటకు నీరు ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి వ్యవసాయ వ్యర్ధాల్లాంటి వనరుల నుండి ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ పురి చెప్పారు.

ప్రత్యామ్నాయ ఇంధనాలకు స్పష్టమైన విధానాలు కీలకం
హెచ్‌ఎంఎస్‌ఐ సీఈవో ఒగాటా
దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధన మార్గదర్శ ప్రణాళికను అమలు చేయాలంటే స్పష్టమైన, స్థిరమైన విధానాల ప్రణాళిక కీలకమని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రెసిడెంట్‌ అత్సుషి ఒకాటా చెప్పారు. ప్రభుత్వ విజన్‌ను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ఇంధన సరఫరా, ధర వంటి సవాళ్లను పరిష్కారం కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ప్రణాళిక విజయవంతంగా అమలయ్యేందుకు తగిన విధానం అవసరమన్నారు.
 

మరిన్ని వార్తలు