నెమ్మదించిన చక్కెర మిల్లుల ఎగుమతి ఒప్పందాలు

21 Dec, 2021 05:54 IST|Sakshi

అంతర్జాతీయంగా ముడి చక్కెర ధరల పతనం నేపథ్యం

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చక్కెర ధరల పతనం నేపథ్యంలో దేశంలో చక్కెర మిల్లుల తాజా ఎగుమతి ఒప్పందాలు నెమ్మదించాయిని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) పేర్కొంది. అయితే ఒప్పందాలకు సమయం మించిపోలేదని, ఇందుకు సంబంధించి సమయం ఇంకా మిగిలే ఉందని కూడా స్పష్టం చేసింది. చక్కెర మిల్లుల సంఘం చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

► 2021 అక్టోబర్‌ నుంచి 2022 సెప్టెంబర్‌ వరకూ సీజన్‌కాగా, ఇందులో తొలి రెండు నెలల్లో (అక్టోబర్, నవంబర్‌) చక్కెర మిల్లుల నుంచి 6.5 లక్షల టన్నుల ఎగుమతులు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో జరిగిన ఎగుమతులు 3 లక్షల టన్నులు.

► ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకూ 37 లక్షల టన్నుల ఎగుమతులకు చక్కెర మిల్లులు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే, ఈ ఒప్పందాలు చాలా వరకు అంతర్జాతీయంగా ముడి చక్కెర ధరలు పౌండ్‌కు (0.453 గ్రాములు) 20–21 సెంట్ల శ్రేణిలో (100 సెంట్లు ఒక డాలర్‌) ఉన్నప్పుడు జరిగాయి. కనిష్టంగా ఈ ధర 19 సెంట్స్‌కు పడిపోయింది. ప్రస్తుతం 19.6 సెంట్స్‌ స్థాయిలో ఉంది. అయితే ఈ ధర వద్ద భారత్‌ చక్కెర ఎగుమతులకు తగిన ధర లభించని పరిస్థితి ఉంది.  

► ప్రస్తుత సీజన్‌లో ఇంకా తొమ్మిది నెలలకు పైగా సమయం మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో  చక్కెర మిల్లులు ఎగుమతి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అనుకూలమైన క్షణం కోసం వేచి ఉండటానికి తగినంత సమయం ఉందని సాధారణ అభిప్రాయం నెలకొంది.

► భారత చక్కెర మిల్లులు రాబోయే 7–8 నెలల్లో మరో రెండు మిలియన్‌ టన్నుల చక్కెరను ఎగుమతి చేయాలని ప్రపంచం కోరుకుంటే, ప్రపంచ (చక్కెర) ధరలు ప్రస్తుత స్థాయిల నుండి పెరగాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు కూడా అభిప్రాయపడుతున్నాయి.  

► ప్రస్తుతం కొనసాగుతున్న 2021–22 సీజన్‌లో డిసెంబర్‌ 15 వరకు దేశంలో చక్కెర ఉత్పత్తి 77.91 లక్షల టన్నులకు చేరుకుంది. ఇది గత సీజన్‌ ఇదే కాలంలో పోల్చితే  (73.34 లక్షల టన్నులు) ఎక్కువ. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో చెరకు క్రషింగ్‌ను ముందుగా ప్రారంభించినందున ఈ సీజన్‌లో ఉత్పత్తి కొంచెం ఎక్కువగా ఉంది.  

► అయితే దేశంలో చక్కెర ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత సీజన్‌లో డిసెంబర్‌ 15 వరకు 19.83 లక్షల టన్నుల ఉత్పత్తి  మాత్రమే జరిగింది. గత సీజన్‌లో ఇదే కాలంతో పోల్చిచూస్తే (22.60 లక్షల టన్నులు) ఇది తక్కువ.

► దేశంలో రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రమైన మహారాష్ట్రలో ఉత్పత్తి 26.96 లక్షల టన్నుల నుంచి 31.92 లక్షల టన్నులకు పెరిగింది.  క్రషింగ్‌ కార్యకలాపాలు ముందుగా ప్రారంభం కావడం, ప్రస్తుత సీజన్‌లో చెరకు ఎక్కువగా లభ్యం కావడం వంటి అంశాలు మహారాష్ట్రలో ఉత్పత్తి పెరుగుదలకు కారణం.  

► దేశంలోని మూడో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రమైన కర్ణాటకలో ఈ సీజన్‌లో డిసెంబర్‌ 15 వరకు ఉత్పత్తి 18.41 లక్షల టన్నులకు చేరుకుంది. క్రితం ఇదే సీజన్‌తో పోలిస్తే ఇది (16.65 లక్షల టన్నులు) ఇది ఎక్కువ.  

లక్ష్యం దిశగా ఇథనాల్‌ సరఫరా....
ఐఎస్‌ఎంఏ ప్రకటన ప్రకారం, ఇథనాల్‌ ఉత్పత్తి లక్ష్యం దిశగా వెళుతోంది. నవంబర్‌తో ముగిసిన 2020–21 సీజన్‌లో 302.30 కోట్ల లీటర్ల ఇథనాల్‌ సరఫరా జరిగిందని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. దీనితో పెట్రోల్‌లో దీని మిశ్రమం అఖిల భారత స్థాయిలో 8.1 శాతానికి చేరింది. 2019–20లో ఈ మిశ్రమం కేవలం 5 శాతం కావడం గమనార్హం. ప్రస్తుత సీజన్‌లో (2021 డిసెంబర్‌–2022 నవంబర్‌) 10 శాతం మిశ్రమం లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందుకు 459 కోట్ల లీటర్ల ఇథనాల్‌ అవసరం.  మొదటి రెండు ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియల (ఈఓఐ) అనంతరం చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు ఇప్పటివరకు మొత్తం 366 కోట్ల లీటర్లను కేటాయించడం జరిగింది. తదుపరి ఈఓఐల ద్వారా మిగిలిన లీటర్ల కేటాయింపులు జరుగుతాయని భావిస్తున్నట్లు ఐఎస్‌ఎంఏ పేర్కొంది.

మరిన్ని వార్తలు