కేంద్రం ప్రభుత్వం కొత్త పోటీ..పేరు పెట్టండి.. 15 లక్షలు గెలుచుకోండి!

28 Jul, 2021 12:38 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌ : దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. తాము ప్రవేశపెట్టిన కొత్త పథకానికి అనువైన పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోలను సూచించిన వారికి భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించింది. ఈ పోటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

ఆగస్టు 15లోగా
కేంద్రం ఇటీవల మౌలిక సదుపాయల కల్పన కోసం డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్సిస్టి‍ట్యూషన్‌కి ఆమోదం తెలిపింది. ఇప్పుడీ డీఎఫ్‌ఐ... తీరు తెన్నులు, లక్ష్యాలను స్ఫూరించేలా ఈ పథకానికి పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోలను సూచించాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఆగస్టు 15వ తేది సాయంత్రం 5:30 గంటల్లోగా తమ ఎంట్రీలను పంపించాలని తెలిపింది.

బహుమతులు
ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. 5 లక్షల వంతున మొత్తం రూ. 15 లక్షలు బహుమతిగా అందిస్తామని పేర్కొంది.  రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన ఎంట్రీలకు రూ. 2 లక్షల వంతున బహుమతులు అందివ్వనున్నారు. 

ఇలా పంపండి
దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజలందరికీ తేలికగా అర్థం అయ్యేలా, పలకడానికి సులువుగా ఉండేలా డీఎఫ్‌ఐకి సంబంధించిన పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోలు ఉండాలని తెలిపింది. పేరు, ట్యాగ్‌లైన్‌, లోగో డిజైన్లు రూపొందించిన వారు https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్‌ ద్వారా కేంద్రానికి ఎంట్రీలను పంపివ్వాల్సి ఉంటుంది. 

డీఎఫ్‌ఐ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్‌ బ్యాంక్ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డెవలప్‌మెంట్‌ యాక్ట్‌ 2021 ద్వారా డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్సిస్టి‍ట్యూషన్‌ (డీఎఫ్‌ఐ)కి ఆమోదం తెలిపింది. డీఎప్‌ఐ ద్వారా దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగు పరచడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. సుమారు 1.11 లక్షల కోట్ల వ్యయంతో 7,000 ప్రాజెక్టులు చేపట్టబోతుంది. ఈ పథకం ద్వారా దేశ రూపురేఖలు మారిపోతాయని కేంద్రం చెబుతోంది. 

మరిన్ని వార్తలు