స్పార్క్‌- పీఐ ఇండస్ట్రీస్‌.. లాభాల స్పార్క్‌

5 Aug, 2020 10:43 IST|Sakshi

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

14 శాతం దూసుకెళ్లిన సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్‌

7 శాతం జంప్‌చేసిన పీఐ ఇండస్ట్రీస్‌ షేరు 

సరికొత్త గరిష్టాన్ని తాకిన పీఐ ఇండస్ట్రీస్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో టర్న్‌ అరౌండ్‌ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్‌ రంగ సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్ కంపెనీ ‌(స్పార్క్‌) కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇదే కాలంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆగ్రి కెమికల్స్‌ కంపెనీ పీఐ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్‌ దాదాపు రూ. 57 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 94 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 971 శాతం జంప్‌చేసి రూ. 185 కోట్లను తాకింది. ఈ కాలంలో గత నష్టాల నుంచి బయటపడుతూ రూ. 61 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. ఇబిటా మార్జిన్లు 5.8 శాతం ఎగసి 32.8 శాతానికి మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో తొలుత స్పార్క్‌ షేరు  14 శాతం దూసుకెళ్లి రూ. 200కు చేరింది. ప్రస్తుతం 8.3 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. 

పీఐ ఇండస్ట్రీస్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో పీఐ ఇండస్ట్రీస్‌ నికర లాభం 43 శాతం వృద్ధితో రూ. 146 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 41 శాతం పెరిగి రూ. 1060 కోట్లకు చేరింది. ఇబిటా 55 శాతం అధికంగా రూ. 236 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో తొలుత పీఐ ఇండస్ట్రీస్‌ షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 1,960కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3.5 శాతం జంప్‌చేసి రూ. 1,900 వద్ద ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తలు