సన్‌ ఫార్మా- ఉత్తమ్‌ గాల్వా.. భళా 

4 Nov, 2020 15:01 IST|Sakshi

క్యూ2(జులై- సెప్టెంబర్‌) ఫలితాల ఎఫెక్ట్‌

సన్‌ ఫార్మా-​రెండు రోజుల్లో 11 శాతం అప్‌

ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్‌ రంగ దిగ్గజం సన్‌ ఫార్మాస్యూటికల్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించడంతో మెటల్‌ రంగ కంపెనీ ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టారు. వెరసి సన్‌ ఫార్మా కౌంటర్‌ వరుసగా రెండో రోజు లాభాలతో సందడి చేస్తుంటే.. ఉత్తమ్‌ గాల్వా అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. వివరాలు చూద్దాం..

సన్‌ ఫార్మాస్యూటికల్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో సన్‌ ఫార్మాస్యూటికల్‌ నికర లాభం 70 శాతం ఎగసి రూ. 1,813 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 5 శాతమే పెరిగి రూ. 8,553 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 3.6 శాతం మెరుగుపడి 25.6 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో సన్‌ ఫార్మా షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 6.5 శాతం జంప్‌చేసి రూ. 518ను అధిగమించింది. ప్రస్తుతం 5 శాతం లాభంతో రూ. 508 వద్ద ట్రేడవుతోంది. వెరసి గత రెండు రోజుల్లో ఈ షేరు 11 శాతంపైగా ర్యాలీ చేసింది.

ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌ రూ. 19.3 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 335 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 142 కోట్ల నుంచి రూ. 195 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 321 కోట్ల నుంచి రూ. 176 కోట్లకు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌ గాల్వా షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 6.50 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. కంపెనీకి సంబంధించి కార్పొరేట్‌ రుణచెల్లింపుల రిజల్యూషన్‌ చేపట్టేందుకు ఎస్‌బీఐకు ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది.

మరిన్ని వార్తలు