40-50 ఏళ్ల వయస్సులో బిజినెస్‌లో రాణించాలనుకునే వారి కోసం

27 Jun, 2022 13:52 IST|Sakshi

ముంబై: దేశీయంగా తొలి స్టార్టప్‌ స్టూడియో జెన్‌ఎక్స్‌ వెంచర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అంకుర సంస్థ సండే టెక్‌ వెల్లడించింది. 40 ఏళ్లు పైబడి, వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే వారికి తోడ్పాటు అందించేందుకు తొలుత 2 మిలియన్‌ డాలర్ల నిధితో దీన్ని నెలకొల్పినట్లు సంస్థ వ్యవస్థాపకుడు జోసెఫ్‌ జార్జి తెలిపారు. వచ్చే మూడేళ్లలో 50 స్టార్టప్‌ల వృద్ధిలో పాలుపంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ తదితర నగరాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. 

కెరియర్‌ మధ్యలో ఉన్న చాలా మంది మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలను వదులుకుని, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ బాట పడుతున్నారని జార్జి పేర్కొన్నారు. స్టార్టప్‌ వెంచర్లలో సహ వ్యవస్థాపకులుగా ఉండటంతో పాటు వాటిని ప్రారంభ దశ నుంచి నిర్మించడంలో స్టార్టప్‌ స్టూడియోల ముఖ్య పాత్ర పోషిస్తాయి. 

1965 నుంచి 1980 మధ్య కాలంలో పుట్టిన జనరేషన్‌ ఎక్స్‌ (జెన్‌ ఎక్స్‌) తరం ప్రస్తుతం 40–50 ఏళ్ల వయస్సులో ఉన్నారని, వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే ఇలాంటి సీనియర్‌ ప్రొఫెషనల్స్‌కు తోడ్పాటు అందించే సరైన వ్యవస్థ ప్రస్తుతం లేని నేపథ్యంలోనే తాము జెన్‌ఎక్స్‌ వెంచర్స్‌ను తలపెట్టామని జార్జి పేర్కొన్నారు.    
 

మరిన్ని వార్తలు