బిగ్‌–సి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేశ్‌ బాబు

25 Sep, 2021 02:57 IST|Sakshi

రెండేళ్లలో మొత్తం 500 ఔట్‌లెట్స్‌

రూ.125 కోట్లు పెట్టుబడులు పెడతాం

కంపెనీ సీఎండీ బాలు చౌదరి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ బిగ్‌–సి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేశ్‌ బాబు నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తారని బిగ్‌–సి సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. కంపెనీ డైరెక్టర్లు స్వప్న కుమార్, జి.బాలాజీ రెడ్డి, కైలాశ్‌ లఖ్యానీ, గౌతమ్‌ రెడ్డితో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ప్రస్తుతం 250 స్టోర్లను నిర్వహిస్తున్నాం. కర్ణాటకలో త్వరలో అడుగుపెడతాం. రెండేళ్లలో కొత్తగా 250 ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తాం.

30,000 జనాభా ఉన్నచోట దుకాణాన్ని తెరుస్తాం. నూతన స్టోర్ల ఏర్పాటుకు రూ.125 కోట్లు పెట్టుబడి అవుతుంది. ఈ నెలలోనే ల్యాప్‌టాప్స్‌ అమ్మకాలను ప్రారంభిస్తున్నాం. 19 ఏళ్లలో 3 కోట్ల పైగా వినియోగదార్లను సొంతం చేసుకున్నాం. వీరిలో 70% పాత కస్టమర్లే. తెలుగు రాష్ట్రాల్లో 30% వాటా చేజిక్కించుకున్నాం. సంస్థలో 2,000 మంది ఉద్యోగులు ఉన్నారు. రెండేళ్లలో వీరి సంఖ్య రెండింతలు అవుతుంది. కోవిడ్‌ ముందస్తు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ.1,000 కోట్ల టర్నోవర్‌ సాధిస్తాం. 2022–23లో రూ.1,500 కోట్లు, తర్వాతి ఏడాది రూ.2,000 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకున్నాం. ఆ తర్వాత ఐపీఓకు వెళ్లాలని భావిస్తున్నాం’ అని వివరించారు.  

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పండుగల సీజన్‌ నేపథ్యంలో ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 4 నుంచి ఈ సేల్‌ ప్రారంభం అవుతుంది. 8.5 లక్షలపైచిలుకు మంది వర్తకులు కోట్లాది ఉత్పత్తులను విక్రయించనున్నారు.
మహేశ్‌ బాబుతో కైలాశ్‌ లఖ్యానీ, స్వప్న కుమార్, బాలు చౌదరి, బాలాజీ రెడ్డి, గౌతమ్‌ రెడ్డి (ఎడమ నుంచి కుడికి) 

మరిన్ని వార్తలు