లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ కేరాఫ్‌ హైదరాబాద్‌

12 Oct, 2021 21:08 IST|Sakshi

ముత్యాల నగరం హైదరాబాద్‌ ఇప్పుడు లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్‌ ఇళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. బడ్జెట్‌ ఇళ్ల నిర్మాణం కంటే లగ్జరీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు కట్టేందుకు డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ రియల్టీ రీసెర్చ్‌ సంస్థ 99 ఎకర్స్‌ తాజా సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. 

నివాస యోగ్యం
ఫార్మా, ఐటీ రంగాల్లో ఇప్పటికే మేటీగా ఉన్న హైదరాబాద్‌ నగరం కరోనా తర్వాత వైద్య సేవల విభాగంలోనూ సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఇక్కడ ఉపాధి లభిస్తోంది. దీంతో నగరంలో జనాభా పెరగడంతో పాటు నివాసం ఉండే ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది.

బడ్జెట్‌ ఇళ్లకే డిమాండ్‌
ప్రస్తుతం నగరంలో ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారిలో 39 శాతం మంది బడ్జెట్‌ ధరలో ఇండిపెండెంట్‌ ఇళ్లు లేదా అపార్ట్‌మెంట్‌ సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ ధరలో నగరంలో నిర్మాణం అవుతున్న ఇళ్ల సంఖ్య తక్కువగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో డిమాండ్‌ 39 శాతం ఉండగా సప్లై మాత్రం కేవలం 26 శాతానికే పరిమితమైంది. 

రూ.కోటి దగ్గరే
నగరంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్‌ హౌజ్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీస్‌లో ఇళ్ల ధర కోటి రూపాయలకు అటు ఇటుగానే ఉంటోంది. ఈ బడ్జెట్‌ సెగ్మెంట్‌లోనే బిల్డర్లు, డెవలపర్లు తమ ప్రాజెక్టుల విస్తరణ చేస్తున్నారు. బిగ్‌ ప్లేయర్లు ఎవరూ కూడా రూ. 40 లక్షలలోపు ఇళ్లు నిర్మించి ఇ‍చ్చేందుకు రెడీగా లేరు. చిన్న ప్లేయర్లు మాత్రమే నగర శివార్లలో రూ. 40 లక్షలలోపు ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు.

డిమాండ్‌ని మించి
నలభై లక్షల నుంచి కోటి రూపాయలు, అంత కంటే ఎక్కువ ధర ఉ‍న్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నగరం నలుమూలల శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. సెమీ లగ్జరీ, లగ్జరీ కేటగిరిలో డిమాండ్‌ 61 శాతమే ఉండగా ఇళ్ల నిర్మాణాలు మాత్రం 74 శాతంగా ఉన్నాయి. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ కంటే ఎక్కువ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి.

నమ్మకం
కరోనా క్లిష్ట పరిస్థితుల నుంచి హైదరాబాద్‌ నగరం వేగంగా కోలుకుంటుంది. ఇక్కడ జనజీవనం గాడిన పడటంతో పాటు ఆర్థిక రంగం వేగంగా పుంజుకుంటోంది. మరిన్ని అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రాబోయే డిమాండ్‌కి తగ్గట్టుగా సెమీ లగ్జరీ, లగ్జరీ సెగ్మెంట్‌లో ఇళ్ల నిర్మాణం భారీగా చేపడుతున్నట్టు బిల్డర్లు చెబుతున్నారు. 

చదవండి : మౌలిక రంగానికి రుణ లభ్యత అంతంతే!

మరిన్ని వార్తలు