కామత్‌ కమిటీ ఏం సూచించింది..?

6 Oct, 2020 04:02 IST|Sakshi

సిఫారసులను మా ముందుంచండి

అన్ని రకాల నోటిఫికేషన్లు, ఆదేశాల వివరాలు కూడా

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

రుణ మారటోరియం కేసు విచారణ 13కు వాయిదా

న్యూఢిల్లీ: రుణాల పునర్నిర్మాణానికి సంబంధించి కేవీ కామత్‌ కమిటీ సిఫారసులను తమ ముందు రికార్డుల రూపంలో ఉంచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే విధంగా రుణాల మారటోరియం విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు, ఉత్తర్వులను కూడా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్‌ వరకు రుణ చెల్లింపులపై విరామానికి (మారటోరియం) ఆర్‌బీఐ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇలా ఈఎంఐలు చెల్లించని కాలానికి వడ్డీతోపాటు.. వడ్డీపై వడ్డీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం సోమవారం కూడా ఈ కేసులో తన విచారణను వీడియో కాన్ఫరెన్స్‌ రూపంలో కొనసాగించింది.

వ్యక్తిగత రుణ గ్రహీతలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ.2 కోట్ల వరకు రుణాలకు గాను వడ్డీపై వడ్డీ భారం వేయకుండా.. ఆ భారాన్ని తాము భరిస్తామంటూ కేంద్ర ఆర్థిక శాఖ అఫిడవిట్‌ సమర్పించింది. కేంద్రం, ఆర్‌బీఐ ఈ విషయమై ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల వివరాలను తమ ముందుంచాలంటూ సెప్టెంబర్‌ 10నాటి తమ ఆదేశాలను ధర్మాసనం గుర్తు చేస్తూ.. కేంద్రం స్పందనలో అవి లేవంటూ వారం రోజుల్లో ఆ వివరాలను తమ ముందు ఉంచాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదన కింద రియల్టీ రంగానికి ఎటువంటి ఉపశమనం లభించదంటూ ఆ రంగం తరఫున సీనియర్‌ న్యాయవాది సీఏ సుందరం కోర్టుకు తెలియజేశారు. దీంతో రియల్‌ ఎస్టేట్, విద్యుదుత్పత్తి తదితర రంగాల అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది. మరిన్ని వివరాల దాఖలు కు గడువు ఇవ్వాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాది వి.గిరి కోర్టును కోరారు. కేంద్రం స్పందనపై పూర్తి స్థాయి అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని మరో న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టును కోరారు.  

సమతూకం అవసరం..
బ్యాంకులు, రుణ గ్రహీతల అవసరాల మధ్య సమతూకం అవసరమని, ఈ విషయంలో అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేస్తూ.. విచారణను ఈ నెల 13కు సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. కేంద్రం నిర్ణయంపై స్పందన తెలియజేయవచ్చంటూ ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ) సహా భాగస్వామ్య పక్షాలన్నింటికీ సూచించింది. ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసిన 24 గంటల్లోగా బ్యాంకులు ప్రణాళికను అమలు చేయగలని ఐబీఏ తరఫు న్యాయవాది హరీష్‌ సాల్వే తెలియజేశారు. కొన్ని రంగాలకు కేంద్రం తాజా ప్రతిపాదనలో చోటు లేకపోవడాన్ని.. మొత్తం పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన మీదట తీసుకున్న నిర్ణయంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా పేర్కొన్నారు. ఆగస్ట్‌తో మారటోరియం గడువు తీరిపోవడంతో.. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. 26 రంగాలకు రుణ పునర్నిర్మాణ అవకాశం కల్పించాలంటూ కామత్‌ కమిటీ సూచించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు