ఫ్యూచర్‌ వివాదంలో అమెజాన్‌కు ఊరట

7 Aug, 2021 02:12 IST|Sakshi

ఆర్బిట్రేషన్‌ ఉత్తర్వులకు సుప్రీంకోర్టు సమర్థన

న్యూఢిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) విలీన వివాదానికి సంబంధించి ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు ఊరట లభించింది. అమెజాన్‌కు అనుకూలంగా అత్యవసర ఆర్బిట్రేటర్‌ (ఈఏ) ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని, భారత చట్టాల ప్రకారం వాటిని అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీనితో రూ. 24,731 కోట్ల ఫ్యూచర్, రిలయన్స్‌ డీల్‌కు బ్రేక్‌ పడినట్లయింది.  వివరాల్లోకి వెడితే.. ఫ్యూచర్‌ కూపన్స్‌లో వాటాదారైన అమెజాన్‌కు.. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి.

ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయి. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్‌ తదితర వ్యాపారాలను రిలయన్స్‌ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌నకు లీగల్‌ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్‌ గ్రూప్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్‌ బెంచ్‌ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్‌.. సుప్రీం కోర్టును ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి.  

మరిన్ని వార్తలు