అనిల్‌ అంబానీకి ‘సుప్రీం’ ఊరట

18 Sep, 2020 04:59 IST|Sakshi

తక్షణ వ్యక్తిగత దివాలా చర్యలకు సుప్రీం నో

ఎస్‌బీఐ పిటిషన్‌ తిరస్కరణ

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే తొలగింపునకు తిరస్కృతి

అయితే అక్టోబర్‌ 6న ఈ వ్యాజ్యంపై

తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సూచన  

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీ గ్రూప్‌ (అడాగ్‌)లో భాగమైన  ఆర్‌కామ్, రిలయన్స్‌ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఆర్‌టీఐఎల్‌)కు ఇచ్చిన రూ.1,200 కోట్ల రుణాల రికవరీకి సంబంధించి ఆయనపై వ్యక్తిగత దివాలా చర్యలు చేపట్టడానికి అనుమతించాలని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దాఖలు చేసిన అప్పిలేట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.  ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న స్టేను తొలగించాలనీ ఎస్‌బీఐ చేసిన విజ్ఞప్తికి న్యాయమూర్తులు ఎల్‌ఎన్‌ రావు, హేమంత్‌ గుప్తా, ఎస్‌. రవీంద్ర భట్‌ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.  అయితే ఈ అంశానికి ఉన్న  ప్రాధాన్యత రీత్యా, తదుపరి విచారణలు ఏమీ లేకుండా అక్టోబర్‌ 6న కేసు విచారణను చేపట్టి తుది తీర్పు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ హై కోర్టుకు సూచించడం ఈ కేసులో మరో కీలకాంశం. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏదైనా మార్పు కోరుకుంటే, సంబంధిత న్యాయస్థానాన్నే ఆశ్రయించవచ్చని కూడా ఎస్‌బీఐకి ధర్మాసనం సూచించింది.
 
వివరాల్లోకి వెళ్తే..:  ఆర్‌కామ్, రిలయన్స్‌ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఆర్‌టీఐఎల్‌)కు 2016 ఆగస్టులో ఎస్‌బీఐ రుణం మంజూరు చేసింది.  ఆర్‌కామ్‌కు రూ. 565 కోట్లు, ఆర్‌టీఐఎల్‌కు రూ. 635 కోట్లు రుణం అందింది. ఈ రుణం మొండిబకాయిగా మారడంతో, అనిల్‌ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును ఎస్‌బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్‌ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీనితో ఎన్‌సీఎల్‌టీ,  ముంబై బెంచ్‌ని ఆశ్రయించింది. గ్యారంటర్‌పైనా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. దీంతో ఏకీభవిస్తూ,  ఎన్‌సీఎల్‌టీ అనిల్‌ ఆస్తులపై దివాలా ప్రక్రియకు వీలుగా మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్‌పీ)ని నియమి స్తూ ఆగస్టు 21న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు అదేనెల 27న స్టే ఇస్తూ,  తదుపరి విచారణను అక్టోబర్‌ 6కు వాయిదా వేసింది. ఈ స్టే ఉత్తర్వు్యను ఎస్‌బీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా