టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

23 Jul, 2021 14:57 IST|Sakshi

న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిలను తిరిగి లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించిన టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టెలికాం కంపెనీలు పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఉన్నత న్యాయస్థానం టెలికామ్ కంపెనీలకు ఏజీఆర్‌ బకాయిలను 10 ఏళ్ల కాలం(2030 వరకు)లో తిరిగి చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఏజీఆర్‌ బకాయిలను ప్రతి సంవత్సరం 10 శాతానికి సమానంగా చెల్లించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి మొదటి విడతగా కంపెనీలు మార్చి 31, 2021లోపు 10 శాతం బకాయిలను చెల్లించాలి.

ఏజీఆర్‌ చార్జీల లెక్కింపునకు సంబంధించి టెలికామ్ విభాగం(డీఒటీ) అనుసరించిన విధానంలో దోషాలు ఉన్నట్లు టెలికాం కంపెనీలు ఆరోపించాయి. ఈ దోషాలను సవరిస్తే కంపెనీలు చెల్లించాల్సిన బకాయలు చాలా వరకు తగ్గుతాయని పేర్కొన్నాయి. మొదట విడత బకాయి నిదులు చెల్లించకపోవడంతో మళ్లీ ఈ వివాదం తిరిగి కోర్టుకు వచ్చింది. ఏజీఆర్‌ ఛార్జీలను తిరిగి లెక్కించేలా డీఓటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా టెలీ సర్వీసెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వారి పెట్టుకున్న అభ్యర్థనను తోసిపుచ్చింది, ఏజీఆర్‌ ఛార్జీలను 10 వార్షిక వాయిదాల్లో చెల్లించాలని ఏప్రిల్‌ 1న జారీ చేసిన ఆదేశాల్లోనే పునఃలెక్కింపును కోర్టు నిషేధించిందని నేటి తీర్పులో ధర్మాసనం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఏజీఆర్‌ ఛార్జీలను తిరిగి లెక్కించడం కుదరని తేల్చి చెప్పింది. వొడాఫోన్-ఐడియా రూ.58,254 కోట్లు, భారతి ఎయిర్‌టెల్‌ రూ.43,980 కోట్లు, టాటా టెలిసర్వీసెస్ రూ.16,798 కోట్లు ప్రభుత్వానికి బకాయి ఉన్నాయి. 

మరిన్ని వార్తలు