‘ఆలస్యానికి మా బాధ్యత లేదు’ రైల్వేశాఖపై సుప్రీంకోర్టు ఫైర్‌

8 Sep, 2021 14:15 IST|Sakshi

మీరు ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు చాలా ఓల్డ్‌ డైలాగ్‌ కానీ మనం ఎక్కిన రైలు సరైన సమయానికి చేరుకోవడమన్నది చాలా అరుదుగా జరిగే సంఘటన. చాలా సార్లు రైళ్లు ఆలస్యం కావడం వల్ల ముఖ్యమైన పనులు చేయలేకపోతుంటా. సరేలే అని సర్థుకుపోతాం. కానీ ఓ వ్యక్తి అలా ఊరుకోకుండా రైలు ఆలస్యంపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఫలితం సాధించాడు.

అంతులేని ఆలస్యం
కశ్మీర్‌కి చెందిన సంజయ్‌ శుక్లా జమ్ము నుంచి శ్రీనగర్‌కి ఫ్లైట్‌ బుక్‌ చేసుకున్నాడు. ఈ ఫ్లైట్‌ని అందుకోవాలంటే మధ్యాహ్నం 12 గంటలకి జమ్ము ఏయిర్‌పోర్టు చేరుకోవాలి. కానీ అతను ఎక్కిన రైలు ఉదయం 8 గంటలకు జమ్ము రావాల్సింది. మధ్యాహ్నం 12 గంటలకు గానీ చేరుకోలేదు. దీంతో సంజయ్‌ తన ఫ్లైట్‌ని మిస్‌ అయ్యాడు. దీంతో ప్రత్యేకంగా కారులో ప్రయాణించి శ్రీనగర్‌ చేరుకున్నాడు. వేళ కాని వేళ చేరుకోవడం వల్ల అక్కడ హోటల్‌లో బస చేయాల్సి వచ్చింది. ఈ ఘటన 2016లో జరిగింది. రైలు ఆలస్యం వల్ల తనకు కలిగిన నష్టంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

మా బాధ్యత కాదు
రైల్వే శాఖ తరఫున అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య బటి వాదిస్తూ ఇండియన్‌ రైల్వే కాన్ఫరెన్స్‌ అసోసియేషన్‌ కోచింగ్‌ టారిఫ్‌ నంబర్‌ 26, పార్ట్‌ 1, వాల్యూమ్‌ 1 ప్రకారం రైలు ఆలస్యానికి ఎటువంటి పరిహారం అందివ్వాల్సిన అవసరం లేదంటూ కోర్టుకు విన్నవించారు. 

సమయానికి వెల కట్టలేం
రైల్వే తరఫున సోలిసిటర్‌ వినిపించిన వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. వినియోగదారుడి సమయానికి వెల కట్టలేమని వ్యాఖ్యానించింది, రైళ్ల ఆలస్యానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. జవాబుదారి తనం ఉండాలని  సూచించింది. ఇలా రైళ్లు ఆలస్యంగా నడిపిప్తూ బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తే ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేరంటూ హెచ్చరించింది.

పరిహారం చెల్లించండి
నిర్దేశిత సమయానికి రైలును గమ్యస్థానం చేర్చలేకపోయినందుకు రైల్వేశాఖను మందలించింది. రైలు ఆలస్యం కారణంగా నష్టపోయిన సంజీవ్‌ శుక్లాకు పరిహారంగా రూ. 30,000లను 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. 

చదవండి: ఐపీఎల్‌లో పది సెకన్ల యాడ్‌కి ఎంత ఛార్జ్‌ చేస్తారో తెలుసా?

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు