వివాదాలన్నీ సుప్రీం ఉత్తర్వుల పరిధిలోకి రావు!

22 Jul, 2021 03:43 IST|Sakshi

జీఎస్‌టీపై సీబీఐసీ వివరణ

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు విషయంలో సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌ 27వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులపై పరోక్ష పన్నులు, సుంకాల కేంద్ర బోర్డు (సీబీఐసీ) బుధవారం వివరణ ఇచ్చింది. అరెస్ట్, సెర్చ్, సమన్ల వంటివి సుప్రీంకోర్టు లిమిటేషన్‌ పొడిగింపు ఉత్తర్వుల పరిధిలోనికి రావని స్పష్టం చేసింది. కేవలం పిటిషన్లు, అప్లికేషన్లు, సూట్స్, అప్పీళ్లు వంటి ప్రొసీడింగ్స్‌కు మాత్రమే సుప్రీం ఉత్తర్వుల పరిధిలోనికి వస్తాయని తెలిపింది.

పెండింగ్‌ కేసులను పన్నుల అధికారులు వేగవంతంగా పరిష్కరించడానికి తాజా సీబీఐసీ వివరణ దోహదపడుతుందని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ సీనియర్‌ పార్ట్‌నర్‌ రజిత్‌ మోహన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిఫండ్, రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణ లేదా రద్దు అప్లికేషన్లపై అధికారులు నిర్ణయాలు తీసుకోవడంసహా  డిమాండ్‌ నోటీసుల ప్రొసీడింగ్స్‌ నిర్వహణ, ఇప్పటికే దాఖలైన అప్పీళ్ల విచారణ వంటివి కొనసాగించడానికి అధికారులకు వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు