ఈఎంఐలపై మారటోరియం : 2 వారాల్లోగా తేల్చండి

10 Sep, 2020 14:56 IST|Sakshi

ఆర్‌బీఐ, కేంద్రం, బ్యాంకులకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ : మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయరాదని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వం, ఆర్‌బీఐ, బ్యాంకులకు రెండు వారాల సమయం ఇచ్చింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపుపై ఆర్‌బీఐ ఆరు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకులు ప్రకటించాయి. వడ్డీపై వడ్డీ వసూలు సరైంది కాదని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక రుణగ్రహీతలపై భారం పడకుండా రెండు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్‌బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో కోర్టు ముందుకు రావాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది.

ఈ కేసును మరోసారి వాయిదా వేసేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్ధానం ఇదే చివరి అవకాశమని రెండు వారాల్లోగా రుణగ్రహీతలకు భారం పడనివిధంగా పరిష్కారంతో అఫిడవిట్‌ సమర్పించాలని కోరింది. రుణగ్రహీతలకు ఊరట ఇచ్చేలా బ్యాంకులతో  ఉన్నతస్ధాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది. మరోవైపు సెప్టెంబర్‌ చివరివారంలో కేసు విచారణ తిరిగి ప్రారంభమయ్యేవరకూ ఆయా ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ మాఫీ చేస్తే అది బ్యాంకింగ్‌ వ్యవస్ధను బలహీనపరుస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో​ ఆర్‌బీఐ రుణాల చెల్లింపుపై ఈ ఏడాది మార్చిలో మూడు నెలల మారటోరియం ప్రకటించి ఆపై ఆగస్ట్‌ 31 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. చదవండి : ఉద్యోగాలు, అడ్మిషన్లలో కోటాపై కీలక నిర్ణయం

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు