అమెజాన్‌–ఫ్యూచర్స్‌ వివాదం

30 Jul, 2021 05:44 IST|Sakshi

సింగపూర్‌ ఆర్బిట్రేటర్‌ అవార్డు చట్ట బద్దతపై సుప్రీం తీర్పు రిజర్వ్‌

న్యూఢిల్లీ: ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌–రిలయన్స్‌ రూ. 24,713 కోట్ల ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సింగపూర్‌ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్‌ నుంచి తీసుకున్న అవార్డు (తీర్పు) భారత్‌ చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతుందా? ఇది దేశీయంగా అమలు సాధ్యమేనా అన్న అంశాలపై సుప్రీంకోర్టు తన తీర్పును గురువారం రిజర్వ్‌ చేసుకుంది. ‘‘ఈ కేసులో వాదోపవాదనలను విన్నాం. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నాం’’ అని  జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్, బీఆర్‌ గవాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన ఆర్బిట్రేషన్‌ అండ్‌ కన్సీలియేషన్‌ యాక్ట్‌ 17 (1), 17 (2) సెక్షన్ల కింద సింగపూర్‌ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్‌ ఇచ్చిన అవార్డు చట్ట బద్దతపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ధర్మాసనం ఇప్పటికే స్పష్టం చేసింది.

సింగపూర్‌ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్‌ ఇచ్చిన అవార్డు, దీని అమలుపై ఢిల్లీ హైకోర్టు సింగిల్, డివిజనల్‌ బెంచ్‌ విభిన్న తీర్పుల నేపథ్యంలో ఈ కేసు  సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌ తన  రిటైల్‌ అండ్‌ హోల్‌సేల్, లాజిస్టిక్స్‌ బిజినెస్‌ను విక్రయిస్తూ 2020లో కుదుర్చుకున్న  రూ.24,713 కోట్ల డీల్‌పై అమెజాన్‌ న్యాయపోరాటం చేస్తోంది.  ఫ్యూచర్‌ అన్‌లిస్టెడ్‌ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో (బీఎస్‌ఈ లిస్టెడ్‌ ఫ్యూచర్‌ రిటైల్‌లో  ఫ్యూచర్స్‌ కూపన్స్‌ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్‌ వారెంట్స్‌ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్‌ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ,  ఫ్యూచర్‌ కూపన్స్‌ డీల్‌ కుదుర్చుకున్నప్పుడే మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఫ్యూచర్‌ రిటైల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్‌ పేర్కొంది. ఇప్పుడు ఫ్యూచర్స్‌ రిటైల్‌ వాటా రిలయన్స్‌కు విక్రయించడం సమ్మతం కాదని వాదిస్తోంది. 

మరిన్ని వార్తలు