సుప్రీంకు అమెజాన్‌–ఫ్యూచర్‌ వివాదం

20 Apr, 2021 05:00 IST|Sakshi

ఢిల్లీ హైకోర్టు ప్రొసీడింగ్స్‌పై స్టే

న్యూఢిల్లీ: అమెజాన్‌–ఫ్యూచర్స్‌–రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మధ్య నలుగుతున్న రూ. 24,713 కోట్ల ఒప్పంద వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌పై జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్, బీఆర్‌ గవాయ్, హృషికేష్‌ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్టే ఇచ్చింది. తదుపరి విచారణను మే 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ వివాదంలో అన్ని అంశాలను పరిశీలించడం జరుగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు వివరాలు క్లుప్తంగా చూస్తే, ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్‌ కూపన్స్‌లో అమెజాన్‌ కొంత వాటా కొనుగోలు చేసింది. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటాలు ఉన్నందున.. అమెజాన్‌ కూడా పరోక్షంగా అందులోనూ (ఫ్యూచర్‌ రిటైల్‌) స్వల్ప వాటాదారుగా మారింది.

ఇక కరోనా వైరస్‌ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్‌ రిటైల్‌ వ్యాపారాన్ని దాదాపు రూ. 24,713 కోట్లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి  విక్రయించేందుకు ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ డీల్‌..  తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్‌ సింగపూర్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్‌  ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్‌ జడ్జి బెంచ్, అమెజాన్‌కు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు డివిజినల్‌ బెంచ్‌ను ఫ్యూచర్‌ ఆశ్రయించింది. సింగిల్‌ జడ్జి బెంచ్‌ రూలింగ్‌పై స్టే తెచ్చుకుంది. దీనిపై సుప్రీంను అమెజాన్‌ ఆశ్రయించింది. తాజా సుప్రీం రూలింగ్‌తో వివాద పరిష్కార ప్రక్రియ తుది దశకు చేరుకుంది.  

మరిన్ని వార్తలు