జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు

20 May, 2022 09:12 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మండలి సిఫార్సుల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మండలి చేసే సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంది. అయితే, మనం సహకార సమాఖ్య వ్యవస్థలో ఉంటున్నందున ఆ సిఫార్సులకు తగిన విలువ ఇవ్వాలని పేర్కొంది. జీఎస్టీ సిఫార్సుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన హక్కులు ఉన్నాయని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం గురువారం వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 246ఏ ప్రకారం.. పన్నుల వ్యవహారాల్లో చట్టాలు చేయడంపై పార్లమెంట్‌కు, రాష్ట్రాల శాసన సభలకు సమాన హక్కులు ఉన్నట్లు గుర్తుచేసింది.  ఆర్టికల్‌ 279 ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవహరించకూడదని తెలిపింది. జీఎస్టీ అమల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలకు జీఎస్టీ మండలి పరిష్కార మార్గాలు సూచించాలని ధర్మాసనం తెలిపింది. ఒకరి అభిప్రాయాలను మరొకరిపై బలవంతంగా రుద్దకూడదని, కలిసి చర్చించుకోవాలని వివరించింది.

నేపథ్యం
సముద్రంలో సరుకు రవాణాపై 5 శాతం ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ(ఐజీఎస్టీ) విధిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను గుజరాత్‌ హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.  కాగా, సుప్రీం తీర్పుతో ‘ఒక దేశం.. ఒకే పన్ను’ విధానంపై ఎలాంటి ప్రవేశం పడే అవకాశం లేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ çఅన్నారు. పన్నుపై మండలి సిఫార్సులను అమోదించడం లేదా తిరస్కరించడంపై రాష్ట్రాలకు కూడా హక్కు ఉందని కోర్టు చెప్పిందన్నారు.


చదవండి: కేంద్రం భారీ షాక్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌పై జీఎస్‌టీ బాదుడు! ఎంతంటే!

మరిన్ని వార్తలు